Breaking News

థర్డ్ ఫ్రంట్ పాతచింతకాయ పచ్చడి.. ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు


వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని అడ్డుకోడానికి ప్రతిపక్ష ఫ్రంట్‌ ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. అంతేకాదు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో థర్డ్ లేదా ఫోర్త్ ఫ్రంట్ విజయవంతమవుతుందని నేను భావించడం లేదని వ్యాఖ్యానించారు. ప్రయత్నించి, పరీక్షించడం అనే అంశం పాతకాలం నాటిది, ప్రస్తుత రాజకీయ వాతావరణానికి సరైంది కాదని పీకే అన్నారు. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌, పది రోజుల వ్యవధిలోనే రెండుసార్లు భేటీ కావడంతో థర్డ్ ఫ్రంట్‌పై జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పవార్‌తో భేటీపై జరుగుతున్న ప్రచారాన్ని పీకే తోసిపుచ్చారు. ఒకరి గురించి ఒకరు మరింత అవగాహన పెంచుకోవడమే పవార్‌తో ముఖాముఖి సమావేశం వెనుక ఆంతర్యమని, గతంలో ఇద్దరం కలిసి సన్నిహితంగా పనిచేశామని అన్నారు. ‘‘ఇరువురి మధ్య తీవ్ర రాజకీయ చర్చలు జరుగుతున్నాయి.. బీజేపీ వ్యతిరేక పోరాటంలో ఏలా ముందుకెళ్లాలనే విషయం గురించి రాష్ట్రాల వారీగా అన్వేషణ సాగుతోంది.. థర్డ్ ఫ్రంట్ మోడల్ ప్రస్తుతానికి తమ వ్యూహంలో లేదు’’ అని పేర్కొన్నారు. బెంగాల్‌ ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయం బీజేపీని అడ్డుకోగలమనే సందేశాన్ని ప్రతిపక్షాలకు పంపిందని ప్రశాంత్ కిశోర్ అన్నారు. రాజకీయ అనుభవం, నెట్‌వర్కింగ్ నైపుణ్యాలకు పీకే వ్యూహాలు జోడిస్తే ఎదురుండదని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే, బెంగాల్ ఎన్నికల తర్వాత వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు పీకే ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ విధానాన్ని విమర్శించిన ఆయన.. ఆ పార్టీకి సమస్య ఉందని, దానిని గుర్తించి పరిష్కరించాలని సూచించారు. మంగళవారం ఢిల్లీలో శరద్ పవార్ అధ్యక్షతన జరిగే సమావేశానికి పలు రాజకీయ పార్టీలు, మేధావులు, విద్యావేత్తలు, మాజీ దౌత్యాధికారులు, బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. ఈ సమావేశం నిర్వహణలో కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా కీలక పాత్ర పోషిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.


By June 22, 2021 at 08:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/dont-believe-3rd-4th-front-can-challenge-bjp-says-prashant-kishor/articleshow/83735912.cms

No comments