Breaking News

సెప్టెంబరు-అక్టోబరు మధ్య గరిష్ఠానికి థర్డ్ వేవ్.. కాన్పూర్ ఐఐటీ సంచలన నివేదిక


కరోనా వైరస్‌ రెండో దశ వ్యాప్తి ఉద్ధృతి నుంచి దేశం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో మహమ్మారి అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ, ముప్పు పొంచి ఉందని, రాబోయే నెలల్లో అనివార్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్‌పై నిపుణులు అంచనాలు రూపొందించారు. సెప్టెంబర్‌-అక్టోబర్‌ మధ్య థర్డ్‌వేవ్‌ గరిష్ఠానికి చేరుకునే అవకాశాలున్నట్లు అంచనా వేశారు. ‘అటు ప్రభుత్వాలు ఇటు సామాన్య ప్రజలకు కరోనా థర్డ్‌వేవ్‌పై ఆందోళన మొదలయ్యింది. ఈ నేపథ్యంలో రెండో దశ వ్యాప్తి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని SIR మోడల్‌ ఆధారంగా మూడో దశ వ్యాప్తి గురించి అంచనా వేశాం’ అని ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ రాజేష్‌ రంజన్‌ పేర్కొన్నారు. జులై 15 వరకు దేశవ్యాప్తంగా మొత్తం అన్‌లాక్‌ ప్రక్రియ జరిగితే.. థర్డ్‌వేవ్‌ పీక్ స్టేజ్‌కు చేరే క్రమాన్ని మూడు విభాగాల్లో అంచనా వేశామని చెప్పారు. 1 (Back to Normal): అక్టోబరులో థర్డ్ వేవ్ గరిష్ఠానికి చేరుకుంటుంది. కానీ, రెండో దశతో పోలిస్తే తీవ్రత తక్కువగానే ఉంటుంది. 2 (Normal With Virus Mutations): ఒకవేళ రెండో దశ వ్యాప్తి కంటే ఎక్కువ ఉంటే అది సెప్టెంబర్‌ నాటికే కనిపించవచ్చు. 3 (Stricter Interventions): ఒకవేళ భౌతిక దూరం, మాస్క్ ధరించడం వంటి కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తే థర్డ్ వేవ్ గరిష్ఠాన్ని అక్టోబర్‌ చివరకు ఆలస్యం చేయవచ్చు. అయినప్పటికీ సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే ఈ తీవ్రత తక్కువగా ఉంటుందని ఐఐటీ కాన్పూర్‌ అధ్యయనం అంచనా వేసింది. కొన్ని ఈశాన్య రాష్ట్రాలు (మిజోరాం, మణిపూర్‌, సిక్కిం) మినహా దేశంలో రెండో దశ పూర్తిగా క్షీణించిందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ రాజేష్‌ రంజన్‌ బృందం స్పష్టం చేసింది. ప్రస్తుతం కేరళ, గోవా, సిక్కిం, మేఘాలయా రాష్ట్రాల్లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 10 శాతానికిపైగా ఉండగా.. చాలా రాష్ట్రాల్లో మాత్రం ఇది 5 శాతం కంటే తక్కువగానే ఉందని తెలిపింది. ‘‘దేశంలో రోజువారీ సగటు కేసులు భారీగా తగ్గాయి.. ఒకానొక దశలో 4 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు.. జూన్ 20 నాటికి 50వేలకు పడిపోయాయి.. చాలా రాష్ట్రాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉంది.. అయితే, కేరళ, గోవా, సిక్కిమ్, మేఘాలయలో మొత్తం పాజిటివిటీ రేటు 10 శాతానికి మించి ఉంది’’ అని పేర్కొంది. ఇటీవల దేశంలో కరోనా మరణాల రేటు 3.5 శాతానికి చేరింది.. కానీ, తొలి దశతో పోల్చితే సెకెండ్ వేవ్‌లో మరణాలు ఎక్కువగానే నమోదయ్యాయి. అయితే, ఈ మోడల్‌లో వ్యాక్సినేషన్‌ను పరిగణలోకి తీసుకోలేదని.. ఒకవేళ అలా తీసుకుంటే గరిష్ఠ స్థాయి తీవ్రత తగ్గుతుందని ఐఐటీ నిపుణులు పేర్కొన్నారు. వీటికి సంబంధించిన మరో అధ్యయన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.


By June 22, 2021 at 08:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/covid-third-wave-peak-expected-around-september-october-says-iit-kanpur-study/articleshow/83736391.cms

No comments