Breaking News

ఇద్దరు కాదు.. ముగ్గుర్ని కనండి.. కొత్త పల్లవి అందుకున్న చైనా పాలకులు!


జనాభా నియంత్రణకు ‘‘ఒక్కరే ముద్దు.. అసలే వద్దు’’ విధానాన్ని మూడు దశబ్దాలు పాటు సమర్ధవంతంగా అమలుచేసిన చైనా.. 2016లో సడలింపులు చేసింది. దేశంలోని జంటలు ఇద్దరు పిల్లలను కనడానికి అనుమతించిన డ్రాగన్ పాలకులు.. తాజాగా కొత్త పల్లవి అందుకున్నారు. ముగ్గురు పిల్లల్ని కనొచ్చంటూ ప్రకటన చైనా చేసింది. ఐదేళ్ల కిందట ఒకే సంతానం విధానానికి ముగింపు పలికి ఇద్దరు పిల్లలను కనడానికి అనుమతించినా, ఆశించినంతగా జనాభా వృద్ధి రేటు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ముగ్గురు పిల్లల విధానానికి ఆమోదం తెలిపినట్టు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. ‘‘ఇది సహాయక చర్యలకు మద్దతుగా ఉంటుంది.. మన దేశ జనాభా నిర్మాణాన్ని మెరుగుపరచడానికి అనుకూలంగా ఉంటుంది.. వృద్ధాప్య జనాభాను చురుకుగా ఎదుర్కోవటానికి, మానవ వనరుల ప్రయోజనం, యోగ్యతలను నిర్వహించడానికి దేశ వ్యూహాన్ని నెరవేరుస్తుంది’’ అని పేర్కొంది. భారత్ మాదిరిగానే చైనా కూడా ప్రతి పదేళ్లకోసారి జనగణన చేపడుతుంది. మే మొదటి వారంలో వెల్లడించిన జనాభా లెక్కల ప్రకారం.. గత దశాబ్దంలో జనాభా వృద్ధి రేటు 0.53 శాతంగా ఉంది. 2000-10 మధ్య ఈ వృద్ధి 0.57గా ఉండేది. 2016లో ఇద్దరు సంతానానికి అనుమతించినా వృద్ధి రేటు అశించినంత లేదు. దీంతో ముగ్గురు సంతానం నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన చైనాలో కార్మిక శక్తిదే కీలక పాత్ర. ప్రస్తుతం 141.2 కోట్లుగా ఉండగా.. వారిలో 60 ఏళ్లు నిండినవారు 26.4 కోట్లుగా ఉంటారని అంచనా. గత పదేళ్లలో ఈ కేటగిరీ జనాభా సంఖ్య 18.7శాతం పెరిగింది. 16-59 ఏళ్ల విభాగంలో 4 కోట్ల మంది తగ్గారు. గతేడాది 12 మిలియన్ల జననాలు నమోదుకాగా.. 2016లో ఇది 18 మిలియన్లుగా ఉంది. 1960 తర్వాత చైనాలో నమోదయిన అత్యల్ప జననాల ఇదే. ఇద్దరు పిల్లల్ని కనొచ్చంటూ అనుమతి ఇచ్చి ఐదేళ్లు గడిచినా.. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో భవిష్యత్‌లో కార్మికుల కొరత ఎదురవుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దాంతో పాటు జనాభా వృద్ధిపై 2019లో ఐక్య రాజ్య సమితి నివేదిక ప్రకారం.. 2027 నాటికి జనాభా చైనాను భారత్ అధిగమిస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంటుంది. దీంతో అధిక జనాభా హోదాను కాపాడుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని అవగతమవుతోంది. చైనా నిర్ణయంపై మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విధానం పూర్తిగా లింగ, పునరుత్పత్తి హక్కులను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. ‘‘ఎంత మంది పిల్లలను కనాలో నియంత్రించే అధికారం ప్రభుత్వాలకు లేదు. జనన విధానాన్ని అమలు చేయడానికి బదులుగా చైనా ప్రజల జీవిత ఆకాంక్షలను గౌరవించాలి.. కుటుంబ నియంత్రణ నిర్ణయాలపై దురాక్రమణ, శిక్షాత్మక నియంత్రణలను అంతం చేయాలి’’ అని అమ్నేస్టీ ఇంటర్నేషనల్ చైనా టీమ్ హెడ్ జోషౌ రోసెన్‌జ్వెగ్ అన్నారు.


By June 01, 2021 at 12:20PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/china-allow-couples-to-have-three-children-up-from-two/articleshow/83138552.cms

No comments