Breaking News

మోదీతో మమతా బెనర్జీ ఘర్షణ.. ఆ అధికారికి కేంద్రం నోటీసు!


పశ్చిమ్ బెంగాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాపన్ బందోపాధ్యాయ తన పదవికి సోమవారం రాజీనామా చేయగా.. ఆయనను మమత తన ప్రధాన సలహాదారుగా నియమించారు. ఇదిలా ఉండగా, అలాపన్ బందోపాధ్యాయకు కేంద్రం తాజాగా షోకాజ్ నోటీసు జారీచేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఉన్నతాధికారిగా గైర్హాజరుపై వివరణ ఇవ్వాలని కోరుతూ డిజాస్టర్ మేనేజిమెంట్ చట్టం కింద నోటీసు ఇచ్చింది. ‘యాస్’తుఫాను నష్టాన్ని అంచనా వేయడానికి గత శుక్రవారం బెంగాల్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశానికి గైర్హాజరుకు కారణం ఏమిటో మూడు రోజుల్లోగా తెలియచేయాలని కేంద్రం పేర్కొంది. అంతేకాదు, మంగళవారం ఉదయం 10 గంటల కల్లా ఢిల్లీలో రిపోర్ట్ చేయాలని కూడా మరో లేఖలో బందోపాధ్యాయను ఆదేశించింది. బెంగాల్ కేడర్ 1987 ఐఎఎస్ అధికారి బందోపాధ్యాయ పదవీ కాలం మే 31తో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయనను మూడేళ్ల కాలానికి మమత తన చీఫ్ అడ్వైజర్‌గా నియమించారు. కేంద్రం ఆయనను వెనక్కు పిలిచినా.. దీదీ మాత్రం రిలీవ్ చేయడానికి నిరాకరించారు. పశ్చిమ బెంగాల్ కొత్త చీఫ్ సెక్రటరీగా హెచ్‌కే ద్వివేది నియమితులయ్యారు. మోదీ పాల్గొన్న సమీక్షా సమావేశానికి బెంగాల్ సీఎం మమత అరగంట ఆలస్యంగా హాజరు కావడంతో దుమారం రేగింది. సమావేశ మందిరానికి చేరుకున్న మమత.. తుఫాను నష్టానికి సంబంధించిన నివేదికను మోదీకి అందజేశారు. తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరావాస పనుల కోసం రూ.20,000 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని మమత కోరారు. పదిహేను నిమిషాల తర్వాత మోదీ అనుమతి తీసుకుని బయటకు వచ్చేశారు. ఈ సమయంలో ఆమె వెంట చీఫ్ సెక్రటరీ అలాపన్ బందోపాధ్యాయ కూడా ఉన్నారు. ప్రధాని సమావేశం ముగిసిన కొద్ది గంటలకు ఆయనను వెనక్కు పిలుస్తూ కేంద్రం నోటీసులు జారీచేసింది. ఈ ఆదేశాలపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన మమత... కేంద్రంపై మండిపడ్డారు. చీఫ్ సెక్రటరీ బందోపాధ్యాయకు నోటీసు ఇవ్వడం ఏకపక్షమని, రాష్ట్ర ప్రభుత్వం ఆయనను రిలీవ్ చేయలేదని ప్రధానికి రాసిన లేఖలో మమత పేర్కొన్నారు. ఎటువంటి కారణం లేకుండా బదిలీచేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ‘‘గైర్హాజరు దృష్ట్యా సమీక్ష సమావేశంలో పాల్గొనాలనుకుంటున్నారా లేదా అని చీఫ్ సెక్రటరీకి ఒక అధికారి ఫోన్ చేశారు. ఆ తర్వాత బెంగాల్ ముఖ్యమంత్రితో పాటు సమావేశ మందిరం లోపలికి వచ్చి వెంటనే బయలుదేరారు’’అని కేంద్రం పేర్కొంది. కేంద్ర వ్యవహారాలను నెరవేర్చడంలో విఫలమైనందుకు నోటీసులు జారీచేసినట్టు తెలిపింది.


By June 01, 2021 at 11:36AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/west-bengal-officer-caught-in-mamata-banerjee-centre-clash-gets-notice/articleshow/83137692.cms

No comments