ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన పదిమంది మృతి
గుజరాత్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ రోడ్డు ప్రమాదం కుటుంబాన్ని బలి తీసుకుంది. కారును ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో 10 మంది మృతి చెందారు. ఆనంద్ జిల్లా తారాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన 10 మంది చనిపోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ట్రక్కు అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు అధికారులు. భారీ శబ్ధంతో కారును ట్రక్కు ఢీకొట్టడంతో ప్రయాణికులు ఎగిరి చెల్లాచెదురుగా పడిపోయారు. మొత్తం పది మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా? అనే కోణంలో పోలీసులు కేసు విచారిస్తున్నారు. ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఒక్కసారిగా రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ట్రక్కు, కారును రోడ్డు పక్కకు తీసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మరోవైపు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు సీఎం విజయ్ రూపాని.
By June 16, 2021 at 11:17AM
No comments