Breaking News

లాక్‌డౌన్ ఉల్లంఘించి ఆఫీసులో ఆరోగ్య మంత్రి రాసలీలలు.. దుమారం రేగడంతో రాజీనామా!


బ్రిటన్‌లో కోవిడ్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ ఆంక్షలను సాక్షాత్తు ఆ దేశ ఆరోగ్య మంత్రే ఉల్లంఘించడంతో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి, తన కార్యాలయంలో సహాయకురాలిని యూకే ఆరోగ్య మంత్రి కౌగిలించుకుని, ముద్దు పెట్టుకున్నారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాగా.. బయటకు రావడంతో దుమారం రేగింది. మంత్రి చర్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో మ్యాట్‌ హాంకాక్‌ శనివారం తన పదవి నుంచి తప్పుకున్నారు. రాజీనామా లేఖను ప్రధాని బోరిస్ జాన్సన్‌కు పంపారు. ఈ మహమ్మారి సమయంలో ఎన్నో త్యాగాలు చేసిన ప్రజలకు ప్రభుత్వం రుణపడి ఉంటుందని తన లేఖలో పేర్కొన్నారు. కుటుంబసభ్యులు కానివారితో భౌతిక దూరం పాటించాలన్న ప్రభుత్వ నిబంధనను ఉల్లంఘించినందుకు ఆయన మరోసారి క్షమాపణ చెప్పారు. బ్రిటన్‌ ఆరోగ్య, సామాజిక భద్రత కార్యాలయంలో పన్నుల చెల్లింపు విభాగం పరిశీలనాధికారి గినా కొలాడాంగెలోను మంత్రి ముద్దుపెట్టుకున్నారు. ఆమెను ఈ ఉద్యోగంలో మంత్రే నియమించినట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. కరోనాపై బ్రిటన్ ప్రభుత్వం జరుపుతున్న పోరాటంలో మ్యాట్ హంకాక్ కీలక పాత్ర పోషించారు. తురుచూ మీడియా ముందుకొచ్చి కోవిడ్ నిబంధనలు, మహమ్మారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను హెచ్చరించేవారు. ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఆయనే నిబంధనలను ఉల్లంఘించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన పదవి నుంచి తప్పుకోక తప్పలేదు. మంత్రి రాజీనామాపై ప్రధాని బోరిస్ జాన్సన్ విచారం వ్యక్తం చేశారు. మీ సేవలు ఎంతో గర్వకారణమని ప్రశంసించారు. గత నెలలోనే సహాయకురాలిని హంకాక్ ముద్దుపెట్టుకున్నట్టు సన్ పత్రిక తెలిపింది. కుటుంబసభ్యుల కానివారితో ఆలింగనం, ముద్దులు పెట్టుకోవడం, భౌతికదూరం నిబంధనలు అప్పటికే అమల్లో ఉన్నాయి. కాగా, మ్యాట్ హంకాక్ స్థానంలో ఆరోగ్య మంత్రిగా సాజిద్ జావేద్‌ను నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జావేద్ గతంలో రెండుసార్లు బ్రిటన్ క్యాబినెట్‌లో ఉన్నారు. తొలిసారి ఆర్ధిక శాఖ, తర్వాత హోం శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. కాగా, బ్రిటన్‌లో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకూ ఈ వేరియంట్ కేసులు 35 వేలకుపైగా నమోదయ్యాయి.


By June 27, 2021 at 03:56PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/uk-health-minister-resigns-after-breaking-covid-rules-and-kissing-his-top-aid-in-office/articleshow/83891723.cms

No comments