Breaking News

వికారమైన భాష వివాదం.. కన్నడిగులు తీవ్ర ఆగ్రహం.. చిక్కుల్లో గూగుల్


భారత్‌లో వికారమైన భాష ఏది అంటూ ఇటీవల గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే ‘కన్నడ’ అని ఫలితం రావడంపై కన్నడనాట తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి అంతేకాదు, ఆ భాష నెటిజన్‌లకు సులువుగా ఉండదని కూడా పేర్కొనడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ విషయంలో గూగుల్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. కర్ణాటక సహా దేశ విదేశాల్లో నివసిస్తున్న కన్నడిగులు ట్విటర్‌లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అలాంటి వెబ్‌సైట్లను ముందు వరుసలో ఉంచడాన్ని తప్పుబడుతున్నారు. ఈ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగడంతో పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు సైతం స్పందించారు. దీనిపై గూగుల్‌ సంస్థకు లీగల్‌ నోటీసు పంపిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కర్ణాటక సాంస్కృతిక-అటవీ శాఖ మంత్రి అరవింద్ లింబావలి మీడియాతో మాట్లాడుతూ.. గూగుల్‌ను లాయర్ నోటీసు ఇస్తామని తెలిపారు. అనంతరం ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ.. దీనిపై గూగుల్ సంస్థ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2,500 ఏళ్ల చరిత్ర కలిగిన కన్నడ భాష.. ఎన్నో శతాబ్దాలుగా తమకు ఎంతో గర్వకారణమని అన్నారు. ‘‘కన్నడను తక్కువచేసి చూపిండం అంటే కన్నడిగుల ఆత్మగౌరవాన్ని అవమానించడానికి గూగుల్ చేసిన ప్రయత్నమే.. దీనిపై గూగుల్ వీలైనంత తొందరగా కన్నడ, కన్నడిగులకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను!’’ మంత్రి లింబావలి ట్వీట్ చేశారు. కాగా.. గూగుల్‌ ప్రతినిధిని ఈ వివాదంపై స్పందిస్తూ.. సరిచేసేందుకు తక్షణమే చర్యలు చేపట్టామని తెలిపారు. అది తమ అభిప్రాయం కాదని.. ప్రజల మనోభావాలు దెబ్బతిన్నందుకు క్షమాపణ చెబుతున్నామని అన్నారు. ‘‘స్థానిక భాష విషయంలో గూగుల్ బాధ్యతా రహితంగా ఎందకు ప్రవర్తిస్తుంది’ అని మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి వ్యాఖ్యానించారు. ట్విట్టర్‌లో గూగుల్ స్క్రీన్ షాట్లను షేర్ చేసిన బెంగళూరు సెంట్రల్ బీజేపీ ఎంపీ పీసీ మోహన్.. గూగుల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు పుట్టినగడ్డ కర్ణాటక.. కన్నడ భాష గొప్ప వారసత్వ సంపద.. అద్భుతమైన, ప్రత్యేకమైన సంస్కృతి దీని సొంతం.. ప్రపంచంలోనే అతి పురాతన భాషల్లో కన్నడ ఒకటి’అని అన్నారు.


By June 04, 2021 at 10:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/google-shows-kannada-as-ugliest-language-in-india-apologises-after-outrage/articleshow/83225656.cms

No comments