Breaking News

నిమ్మరసం అమ్మినచోటే పోలీస్ అధికారిగా.. కేరళ మహిళ స్ఫూర్తిదాయక విజయం


ప్రేమించి పెళ్లిచేసుకున్న ఓ యువతి 18 ఏళ్ల వయసులోనే బిడ్డకు జన్మినిచ్చింది.. కట్టుకున్నవాడికి మోజు తీరిపోయిందమే ఆమెను వదిలి వెళ్లిపోయాడు.. పుట్టింటికి వెళితే అక్కడా ఆదరించలేదు.. తమ ఇష్టానికి విరుద్ధంగా పెళ్లిచేసుకున్నావని ఆమెను ఇంటిలోకి రానివ్వలేదు.. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆరు మాసాల బిడ్డతో నాయినమ్మ పంచన చేరింది.. పొట్టకూటికోసం వీధుల్లో నిమ్మరసం, ఐస్‌ క్రీమ్‌లు అమ్మింది.. అయితే, ఓ వ్యక్తి ఇచ్చిన సలహా ఆమె జీవితాన్ని అనుహ్య మలుపు తిప్పింది. ఆయన సహకారంతో మధ్యలో ఆపేసిన చదువును పూర్తిచేసి.. ఎస్ఐ ఉద్యోగ పరీక్షను రాసి విజయం సాధించింది. ఎక్కడ తాను నిమ్మరసం, ఐస్‌క్రీమ్‌లు అమ్మిందో అదే పట్టణంలో ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించింది. ఇది కేరళకు చెందిన అనై శివ (31) అనే మహిళ విజయగాథ. ఆమె జీవిత పోరాటం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. కేరళలోని వర్కలకు చెందిన అనై శివ తాను పోలీస్ ఆఫీసర్‌ను అవుతానని కలలో కూడా అనుకోలేదు. జీవితంలో కష్టాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన అనై శివ గురించి కేరళ పోలీస్ విభాగం ట్విట్టర్‌లో పేర్కొంటూ.. ప్రొబేషనరీ ఎస్ఐ‌గా బాధ్యతలు చేపట్టిన ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. ‘‘సంకల్ప శక్తి, ఆత్మ విశ్వాసానికి నిజమైన ప్రతిరూపం.. భర్త, కుటుంబ సభ్యులను విడిచిపెట్టి ఆరు నెలల శిశువుతో వీధుల్లో ఒంటరిగా మిగిలిపోయిన 18 ఏళ్ల బాలిక వర్కాలా పోలీస్ స్టేషన్‌కు సబ్ ఇన్స్పెక్టర్ అయ్యింది’’ అని ట్వీట్ చేసింది. వర్కాలా పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పోస్టింగ్ ఇచ్చిన విషయం తనకు కొద్ది రోజుల కిందటే తెలిసిందని ఏఎన్ఐతో శివ అన్నారు. నా కుమారుడితో వీధుల్లో కన్నీళ్లు పెట్టుకున్నా ఎవరూ మద్దతు దక్కని ప్రదేశం ఇది అని భావోద్వేగానికి గురయ్యారు. ‘‘వర్కలా శివగిరి ఆశ్రమంలో నిమ్మరసం, ఐస్‌క్రీమ్‌లు, హస్తకళా వస్తువుల అమ్మకం వంటి చిన్ని చిన్న వ్యాపారాలు చేయడానికి ప్రయత్నించినా ఏదీ కలిసిరాలేదు.. ఈ సమయంలో చదువు పూర్తిచేసి, ఎస్ఐ పరీక్ష రాయమని ఓ వ్యక్తి సలహా ఇచ్చి సాయం చేశాడు’’ అని తెలిపింది. ‘‘తాను డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగానే తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లిచేసుకున్నాను.. ఏడాదిలోపే బిడ్డకు తల్లినయ్యాను.. తర్వాత భర్త వదిలేసి వెళ్లిపోయాడు’’ అని చెప్పింది. ‘‘పుట్టింటికి వెళితే అక్కడా ఆదరించలేదు.. నాయినమ్మతో కలిసి ఓ చిన్న గుడిసెలో జీవనపోరాటం మొదలుపెట్టాను.. అక్కడ నుంచి బతుకుదెరువు కోసం అనేక ప్రాంతాలకు మారు.. ఐపీఎస్ అవ్వాలని ఎప్పుడూ అనుకునేదాన్ని.. కానీ, నా అదృష్టం మరోలా ఉంది.. ప్రస్తుతం చాలా మంది నా ఫేస్‌బుక్ పోస్ట్‌ను షేర్ చేసిన తరువాత నేను పొందుతున్న మద్దతుతో నేను గర్వపడుతున్నాను.. ఉద్వేగభరితంగా ఉన్నాను’’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి.. తమ కాళ్ల మీద నిలబడటానికి ప్రయత్నిస్తున్న ఏ మహిళకైనా తన జీవిత కథ ప్రేరణ కలిగిస్తే సంతోషంగా ఉంటుంది.. అసమానతలతో పోరాడుతూ నేను ఇక్కడకు చేరుకోగలిగాను’ అని పేర్కొన్నారు.


By June 28, 2021 at 09:47AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kerala-woman-who-once-sold-lemonade-for-a-living-is-now-police-officer/articleshow/83911030.cms

No comments