Breaking News

‘కొందరికి ఫ్రీగా.. మరి కొందరికి డబ్బులకు టీకాలా?’ కేంద్ర విధానంపై సుప్రీం అసహనం!


దేశంలో కరోనా పరిస్థితులపై సుమోటోగా విచారణ జరుపుతున్న .. కేంద్ర ప్రభుత్వ టీకా విధానంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్రం అనుసరిస్తున్న ‘చెల్లింపు టీకాల విధానం’ నిరంకుశం, అహేతుకం అని వ్యాఖ్యానించింది. 45 ఏళ్లు దాటినవారికి ఉచితంగా, 18-44 ఏళ్ల మధ్యవారికి చెల్లింపులతో టీకాలు ఇవ్వడం అసంబద్ధమని, ఆ విధానాన్ని మళ్లీ సమీక్షించాలని ఆదేశించింది. అంతేకాదు, కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం కేటాయించిన రూ.35,000 కోట్లను ఇంతవరకు ఎలా ఖర్చు చేశారో వివరాలు తమకు సమర్పించాలని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌ల ప్రత్యేక ధర్మాసనం స్పష్టం చేసింది. వివిధ అంశాలపై కేంద్రం నుంచి మరింత లోతైన సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించిన న్యాయస్థానం.. ఈ నేపథ్యంలో ఘాటు వ్యాఖ్యలు చేసింది. సరళీకరించిన టీకాల విధానం; కేంద్రం, రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులకు టీకా ధరల్లో వ్యత్యాసం; దానికి ఉన్న ప్రాతిపదిక, స్లాట్‌ బుకింగ్‌ కోసం కొవిన్‌ యాప్‌లో పేరు నమోదును తప్పనిసరి చేయడం వంటి అంశాలపై ప్రశ్నలు సంధించింది. ఒక్కొక్క అంశానికి వేర్వేరుగా సమాధానాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. సోమవారం ఇచ్చిన ఈ ఆదేశాలను బుధవారం సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.‘‘తొలి దశలో అనారోగ్య సమస్యలున్నవారికి, ఇతర లోపాలున్నవారికి టీకాల్లో ప్రాధాన్యం ఇచ్చారు. సరళీకృత విధానంలో అలాంటి ప్రాధాన్యాలేమీ లేవు. వైరస్‌ జన్యు మార్పులకు గురై.. 18-44 ఏళ్ల మధ్యవారికి ముప్పుగా మారుతుందని రెండో దశ ఉద్ధృతి నిరూపించింది. శాస్త్రీయ ప్రాతిపదికన వేర్వేరు వర్గాల మధ్య ప్రాధాన్యాలు కొనసాగించాల్సి ఉన్నా 18-44 ఏళ్ల వారికీ టీకాలు వేయాలి’’ అని ధర్మాసనం పేర్కొంది. వ్యాక్సిన్ పాలసీకి సంబంధించిన వివరాలను సమర్పించాలని ఆశించిన సుప్రీంకోర్టు.. అందుకు తగ్గ ఫైల్‌ నోటింగ్స్‌ను కూడా జత చేయాలని కేంద్రానికి సూచించింది. ఇప్పటివరకు కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, సుత్నిక్‌-వి టీకాల కొనుగోలుకు సంబంధించిన వివరాలను కూడా ఇవ్వాలని ఆదేశించింది. ‘వ్యాక్సిన్ల సేకరణ కోసం కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన రూ.35వేల కోట్లలో ఇంతవరకు ఎంత ఖర్చు చేశారు? 18-44 ఏళ్ల వారికి టీకాలు ఇవ్వడానికి ఈ నిధులను ఎందుకు ఉపయోగించకూడదు?’ అని ప్రశ్నించింది. ‘ఈ ఏడాది చివరి నాటికి ఎన్ని డోసుల అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు? ఇందుకు సంబంధించిన మార్గ సూచి ఏమిటి? మూడు దశలుగా సాగిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో టీకా వేసుకోడానికి ఎంత మంది అర్హత పొందారు? జనాభాలో ఎంత శాతం మందికి టీకాలు వేశారు? మిగతా వారికి ఎప్పుడు, ఏ విధంగా వ్యాక్సిన్లు ఇస్తారు? ఇందుకు సంబంధించిన ప్రణాళిక ఏమిటి?’ అని ప్రశ్నించింది. ‘ప్రజలకు ఉచితంగా టీకాలు వేస్తామని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రకటించినట్టు మే 9న సమర్పించిన అఫిడ్‌విట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయాన్ని సమ్మతిస్తున్నారా? తిరస్కరిస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు స్పష్టం చేయాలి. టీకాల విధానంపై అభిప్రాయాలను తెలియజేస్తూ ప్రతి రాష్ట్రం రెండు వారాల్లోగా అఫిడ్‌విట్ సమర్పించాలి. నిర్దిష్టంగా తమ విధానాలను దానిలో స్పష్టీకరించాలి’ అని స్పష్టంచేసింది. అలాగే, థర్డ్ వేవ్‌లో పిల్లలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అంత్యక్రియలు జరిపి వర్కర్లకు టీకాలు, డిసెంబరు 31 వరకు అందుబాటులో ఉండే టీకాల సహా ఆరు అంశాలపై స్పష్టతనివ్వాలని కోరింది. అనంతరం విచారణను జూన్ 30కి వాయిదా వేసింది. కార్యనిర్వాహక వ్యవస్థ విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని కేంద్రం చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. పౌరుల రాజ్యాంగపరమైన హక్కులకు భంగం కలిగినప్పుడు కోర్టులు మౌనంగా ప్రేక్షక పాత్ర పోషించవని, ఇది రాజ్యాంగంలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించింది.


By June 03, 2021 at 08:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/apex-court-slams-centres-covid-vaccination-policy-for-18-44-year-olds/articleshow/83193755.cms

No comments