Breaking News

భారత్‌లో వెలుగుచూసిన B.1.617 వేరియంట్‌కు కొత్త పేరు.. WHO కీలక ప్రకటన


భారత్‌లో తొలిసారిగా వెలుగుచూసిన వేరియంట్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) పేరును సూచించింది. దేశంలో వ్యాప్తిలో ఉన్న B.1.617 వేరియంట్‌కు ‘డెల్టా’అని నామకరణం చేస్తూ డబ్ల్యూహెచ్‌ఓ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు భారత్‌లో గుర్తించిన కరోనా వేరియంట్‌కు ‘కప్పా’గా పేర్కొంది. భారత్‌లో ప్రస్తుతం కరోనా వ్యాప్తికి B.1.617 వేరియంట్ కారణం కాగా.. దీనిని తొలిసారిగా గతేడాది అక్టోబరులో గుర్తించారు. అయితే, దీనిని ఇండియన్‌ వేరియంట్‌ అని పిలవడంపై భారత్‌ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా వెలుగుచూసే కరోనా వైరస్‌లు లేదా వేరియంట్‌లను దేశాల పేర్లతో పిలవకూడదని ఇప్పటికే డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. దీంతో భారత్‌లో వెలుగుచూసిన వేరియంట్‌కు ‘డెల్టా’గా నామకరణం చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ప్రస్తుతం ఉన్న శాస్త్రీయ నామాలను నూతన పేర్లు భర్తీ చేయవని స్పష్టం చేసింది. శాస్త్రీయ నామాలు విలువైన సమాచారం, పరిశోధనలో ఉపయోగపడతాయని పేర్కొంది. అలాగే, కొవిడ్‌ కొత్త వేరియంట్ల గుర్తింపు, నివేదిక ఇవ్వడంలో ఏ దేశం నిరాకరించకూడదని తెలిపింది. SARS-COV-2 వైరస్‌ స్ట్రెయిన్‌లకు పేరు పెట్టడం, వాటిని గుర్తించడం కోసం ఏర్పాటు చేసిన నామకరణ వ్యవస్థలు శాస్త్రీయ పరిశోధనల వాడుకలో ఉంటాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. కోవిడ్‌ వేరియంట్లను గ్రీక్‌ ఆల్ఫాబెట్‌లు అయిన ఆల్ఫా, బీటా, గామా తదితర పేర్లతో పిలవాలని డబ్ల్యూహెచ్‌ఓ టెక్నికల్ నిపుణుల బృందానికి చెందిన డాక్టర్ మారియా వాన్ కెర్ఖోవే అన్నారు. ఇవి సాధారణ ప్రజలు సైతం పలకడానికి, చర్చించడానికి సులువుగా ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే యూకే వేరియంట్‌కు ఆల్ఫాగా, దక్షిణాఫ్రికా వేరియంట్‌కు బీటాగా, బ్రెజిల్‌ వేరియంట్‌కు గామాగా నామకరణం చేశారు. గత అక్టోబర్‌లో భారత్‌లో వెలుగుచూసిన బి.1.617 వేరియంట్‌ను ఇప్పటివరకు 53 దేశాల్లో అధికారికంగా గుర్తించారు. అనధికారికంగా మరో ఏడు దేశాల్లోనూ ఈ వేరియంట్ వ్యాప్తిలో ఉంది. అత్యంత ప్రమాదకారి, వేగంగా వ్యాప్తిచెందే ఈ వేరియంట్‌ గురించి పరిశోధనలు కొనసాగుతున్నాయి. దీనిని డబుల్ మ్యుటెంట్ వేరియంట్‌గా పిలుస్తున్నారు. ఎందుకంటే ఇందులో E484Q, L452R రెండు జన్యువులున్నాయి.


By June 01, 2021 at 07:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/covid-strain-first-found-in-india-named-delta-variant-says-who/articleshow/83133934.cms

No comments