Breaking News

రెండు దశాబ్దాల్లో 750 చదరపు కి.మీ. కరిగిపోయిన ఐస్‌లాండ్ మంచు కొండలు!


మానవాళి విచ్చలవిడిగా విడుదల చేస్తున్న హానికారక వాయువులతో హిమశిఖరాలు నిలువెల్లా కరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వల్ల హిమానీ నదాలు తరిగిపోయి జలవిలయానికి కారణమవుతున్నాయి. తాజాగా, ఐస్‌లాండ్‌లో 20 ఏళ్లలో ఏకంగా 750 చదరపు కిలోమీటర్ల మేర మంచు కరిగిపోయింది. అంటే, అక్కడ 7 శాతం మంచు నీళ్లలా మారిపోయింది. ఆ దేశ భూభాగంలో 10 శాతానికిపైగా విస్తరించి ఉన్న హిమానీనదాలు 2019లో 10,400 చదరపు కిలోమీటర్లకు కుచించుకుపోయినట్టు ఐస్‌లాండ్ సైంటిఫిక్ జర్నల్ జోకుల్ అధ్యయనంలో తేలింది. 1890 నుంచి ఇప్పటి వరకూ 2,200 చదరపు కిలోమీటర్ల మంచు కరిగిపోగా.. అందులో మూడో వంతు గడచిన 20 ఏళ్లలోనే కరిగిపోవడం గమనార్హం. ఇది ఆ దేశ హిమనీనదాల్లో 18 శాతం. ఈ 20 ఏళ్లలో కరిగిన మంచు ఐస్‌లాండ్‌లోని అతిపెద్ద మంచు కొండ అయిన హాఫ్జోకల్‌కు దాదాపు సమానమని అధ్యయనం తెలిపింది. ఇక, 2014లో ఒక్జోకల్‌ను గ్లేసియర్ (హమనీ నదం) హోదా నుంచి పరిశోధకులు తప్పించారు. రెండేళ్ల క్రితం ఆ హిమనీనదం పూర్తిగా కరిగిపోయింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2.2 లక్షల హిమనీ నదాలుండగా.. అందులో చాలా వరకు వేగంగా కరిగిపోతున్నాయని ఇటీవల నాసా పరిశోధనల్లో వెల్లడయ్యింది. సముద్ర మట్టాల పెరుగుదలలో వీటి నీరు ఐదో వంతు (20%) అని ఈ ఏడాది ఏప్రిల్‌లో నేచుర్ జర్నల్‌లో ప్రచురించిన ఫలితాల్లో పేర్కొన్నారు. 2000 నుంచి 2019 మధ్య ఏటా 26,700 కోట్ల టన్నుల మంచు కరిగినట్టు నాసా టెరా ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. 2000 నుంచి 2004 మధ్య ఏటా సగటున 22,700 కోట్ల టన్నుల మంచు కరిగితే.. అదే 2015 నుంచి 2019 మధ్య సగటు 29,800 కోట్లుగా తేలింది. ఐస్‌లాండ్‌లో గ్లేసియర్స్‌కు ముప్పు పొంచి ఉందని, 2,200 నాటికి ఇవి పూర్తిగా కనుమరుగవుతాయని ఇటీవల నిపుణులు హెచ్చరించారు. ‘‘1890 నుంచి ఐస్‌లాండ్‌లో హిమానీనద-ప్రాంత వైవిధ్యాలు, వాతావరణంలోని వైవిధ్యాలకు స్పష్టమైన ప్రతిస్పందనను చూపుతాయి .. దేశవ్యాప్తంగా కుదించుకుపోతున్నాయి.. అయినప్పటికీ పర్యావరణానికి హాని కలిగించే కార్యకలాపాలు కొన్ని హిమానీనదాల ఉనికి ప్రభావితం చేస్తాయి’’అని అధ్యయనకర్తలు వ్యాఖ్యానించారు.


By June 01, 2021 at 03:15PM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/iceland-glaciers-lost-750-square-kilometers-in-past-20-years-says-study/articleshow/83141688.cms

No comments