Breaking News

రాజీ కోసం వెళ్లిన చిరాగ్‌కు పరాభవం.. 2 గంటలు బయటే నిలబెట్టిన బాబాయ్!


దివంగత రాం విలాస్‌ పాసవాన్‌ నెలకొల్పిన లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)లో తిరుగుబాటుకు ఆయన చిన్న తమ్ముడే నాయకత్వం వహించారు. రాంవిలాస్‌ కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ను సోమవారం అధ్యక్ష పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. చిరాగ్‌తో కలిసి ఆ పార్టీ తరఫున ఆరుగురు లోక్‌సభ సభ్యులు ఉండగా, అందులో అయిదుగురు ఓ వర్గంగా ఏర్పడ్డారు. చిరాగ్‌ చిన్నాన్న, ఎంపీ పశుపతి కుమార్‌ పారస్‌ను తమ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఇందుకు బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్‌ వ్యవహరించిన తీరే కారణం. ఎన్‌డీఏ నుంచి బయటకు రావడం, జేడీ(యూ), సీఎం నీతీశ్‌కు వ్యతిరేకంగా ఎల్‌జేపీ తరఫున అభ్యర్థులను నిలబెట్టడం అసంతృప్తికి దారితీసింది. పార్టీ అధ్యక్షుడిని మార్చిన విషయాన్ని తిరుగుబాటుదార్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు వివరించారు. దీంతో పశుపతి పారస్‌ను లోక్‌సభలో ఎల్‌జేపీ పక్ష నేతగా గుర్తిస్తున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. తాజా సమీకరణాలతో చిరాగ్‌కు అవకాశాలు సన్నగిల్లగా.. పారస్‌కు నితీశ్ హామీ లభించినట్టు తెలుస్తోంది.. అసమ్మతిని చల్లార్చడానికి రాజీకోసం చిరాగ్ ప్రయత్నించినా ఫలించలేదు. పశుపతి పారస్‌ మీడియాతో మాట్లాడిన అనంతరం చిరాగ్‌ ఆయన నివాసానికి వెళ్లారు. మరో చిన్నాన్న కుమారుడు, ఎంపీ అయిన ప్రిన్స్‌ రాజ్‌ కూడా అక్కడే ఉన్నారు. కానీ, ఆయనను ఎవరూ లోపలికి పిలకపోవడంతో కారులోనే గంటపాటు ఉన్నారు. తర్వాత తనకు తానే ఇంటి లోపలికి వెళ్లారు. 45 నిమిషాలు వేచి ఉన్నా కూడా కలవడానికి వారు నిరాకరించారు. ఇంట్లో ఉన్నా లేరని చెప్పడంతో చిరాగ్ అక్కడ నుంచి నిరాశగా వెనుదిరిగారు. తన తల్లికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తానన్న రాజీ సూత్రాన్ని ప్రతిపాదించారు. దీనికి రెబల్ నేతలు స్పందించలేదు. ‘‘మా పార్టీకి ఆరుగురు ఎంపీలు ఉన్నారు.. పార్టీని కాపాడుకోవాలని ఐదుగురు ఎంపీలు నిర్ణయించారు.. కాబట్టి నేను పార్టీని చీల్చలేదు.. కాపాడాను.. నా అన్న కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉంటారు.. దీనికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు’’ అని పశుపతి పరాస్ అన్నారు.


By June 15, 2021 at 08:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/after-coup-in-ljp-chirag-paswan-at-uncles-doorstep-returns-after-long-wait/articleshow/83530977.cms

No comments