Breaking News

PM Modi సమీక్ష.. అరగంట వెయిట్ చేయించిన బెంగాల్ అగ్గి బరాటా!


యాస్‌ తుఫాను ప్రభావిత రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. పశ్చిమ్ బెంగాల్, ఒడిశాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం ప్రధాని.. అధికారులతో సమావేశమయ్యారు. ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి బెంగాల్‌ సీఎం గైర్హాజరు కావడంతో రాజకీయ దుమారం రేగుతోంది. అంతేకాదు, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీఎం మమతా బెనర్జీ రాకకోసం ప్రధాని, బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్ ధన్ఖర్‌లు 30 నిమిషాల పాటు వేచి చూశారని తెలుస్తోంది. అయితే, ఉద్దేశపూర్వకంగానే మమతా ఆ సమావేశానికి హాజరుకాలేదని, ఆమె నియంతృత్వ స్వభావానికి ఇది పరాకాష్ట అని దుయ్యబట్టారు. బెంగాల్‌లో ఏరియల్‌ సర్వే నిర్వహించిన అనంతరం.. కలైకుందా ఎయిర్‌బేస్‌లో అధికారులతో మోదీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు ముఖ్యకార్యదర్శి హాజరుకావాల్సి ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ రాలేదు. కేవలం గవర్నర్‌, ప్రతిపక్షనేత సువేందు అధికారి మాత్రమే రాగా.. మమతా బెనర్జీీ అరగంట ఆలస్యంగా అక్కడకు చేరుకున్నారు. వచ్చిన వెంటనే ఓ నివేదికను మోదీ చేతిలో పెట్టి పావు గంట తర్వాత ఇతర కార్యక్రమాలు ఉన్నందున వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వెంటనే వెనుదిరిగారు. ‘‘ఈ రోజు మీరు నన్ను కలవాలని భావించారు.. అందుకే వచ్చాను.. నేను, నా ప్రధాన కార్యదర్శి ఈ నివేదికను మీకు సమర్పించాలనుకుంటున్నాను.. ఇప్పుడు దిఘాలో ఓ సమావేశానికి హాజరుకావాల్సి ఉన్నందున వెళ్లడానికి మీ అనుమతి తీసుకుంటున్నాం’’ అని మమతా అక్కడ నుంచి వెళ్లిపోయారు. ప్రధానితో సమీక్ష సమావేశానికి హాజరుకాకపోవడం పట్ల సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఇతర కార్యక్రమాల్లో ఉన్నందు వల్లే సమావేశానికి ఆలస్యంగా వచ్చానని పేర్కొన్నారు. ఏదిఏమైనప్పటికీ ప్రధాని సమీక్షా సమావేశానికి అధికారులను కూడా మమతా పంపకపోవడం చర్చనీయాంశమయ్యింది. ఉద్దేశపూర్వకంగానే అధికారులను కూడా ఈ సమావేశానికి హాజరు కావద్దని సూచించినట్లు తెలుస్తోంది. ప్రధానితో సమావేశానికి మమతా బెనర్జీ గైర్హాజరు పట్ల బెంగాల్ గవర్నర్‌ జగ్‌దీప్‌ ధనకర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి సమావేశానికి గైర్హాజరు కావడం రాజ్యాంగం, సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఇటువంటి చర్యలు ప్రజలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారరు. ఇక మమతా బెనర్జీ తీరుపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానిని కించపరిచేలా, అమర్యాదగా ఓ ముఖ్యమంత్రి ప్రవర్తించడం గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొంది. మమతా బెనర్జీ నియంతృత్వ పోకడలకు తాజా సంఘటన ఓ నిదర్శనమని, రాజ్యాంగ విలువలను అగౌరవపరచడమేని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానితో కలిసి పనిచేయాల్సింది పోయి రాజకీయాలు చేయడం దీదీ పట్ల అసహ్యం కలిగేలా చేస్తోందని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు జరిగిన తర్వాత ప్రధాని, మమతా బెనర్జీ మధ్య సమావేశం జరగడం ఇదే తొలిసారి.


By May 29, 2021 at 07:01AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-narendra-modi-waiting-30-minutes-for-west-bengal-cm-mamata-banerjee/articleshow/83054257.cms

No comments