Breaking News

Israel Attacks గాజాాలో ఇజ్రాయేల్ విధ్వంసం.. 192కి చేరిన మృతులు


పాలస్తీనాలోని గాజా నగరంపై ఇజ్రాయేల్ దాడులు కొనసాగుతున్నాయి. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా జరుపుతున్న వైమానిక దాడుల్లో జనం భారీగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఆదివారం ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో గాజాలో 42 మంది మృతి చెందగా.. 50 మందికిపైగా గాయపడ్డారు. మూడు భారీ భవంతులు నేలమట్టమయ్యాయి. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఇంత భారీ స్థాయిలో విధ్వంసం జరగడం ఇదే తొలిసారి. ఈ దాడుల్లో ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ భవనం కూడా ధ్వంసమయ్యింది. ఇజ్రాయేల్ దాడులతో గాజా వాసులు చిగుటాకులా వణికిపోతున్నారు. ఈ ఘర్షణలు మరోయుద్ధానికి దారితీసే అవకాశం ఉందని ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ సంకేతాలు ఇచ్చారు. ఆదివారం ఆయన అధికారిక టెలివిజన్‌లో ప్రసంగిస్తూ.. హమాస్‌ ఉగ్రవాదుల అంతు చూస్తామని హెచ్చరించారు. తమపై రాకెట్‌ దాడులకు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని, ఇప్పట్లో దాడులు ఆపబోమని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగానే హమాస్‌ స్థావరాలతోపాటు వారి నాయకులపైనా ఇజ్రాయేల్‌ దాడులను ఉద్ధృతం చేసింది. దక్షిణ గాజాలోని హమాస్‌ కీలక నేత యాహియా సిన్వార్‌, ఆయన సోదరుడి నివాసాలను బాంబులతో ధ్వంసం చేసింది. గాజాలో ఇప్పటివరకు 192 మంది పాలస్తీనియులు మృతి చెందారు. వీరిలో 58 మంది చిన్నారులుండటం బాధాకరం. ఇజ్రాయేల్ దాడుల్లో తమ సంస్థకు చెందిన 20 మంది చనిపోయినట్టు హమాస్ ప్రకటించింది. ఇజ్రాయేల్‌పై హమాస్‌ రాకెట్ దాడుల్లో 5 ఏళ్ల చిన్నారి, ఓ సైనికుడు సహా 10 మంది పౌరులు చనిపోయారు. తూర్పు జెరూసలెం షేక్‌ జారా ప్రాంతంలో పోలీసులపైకి ఓ వ్యక్తి కారుతో దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు ఇజ్రాయెల్‌ పోలీసులు గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయేల్‌పై తాము కూడా రాకెట్ దాడులు కొనసాగిస్తున్నామని ప్రకటించారు. తాము ప్రయోగించిన రాకెట్ దక్షిణ ప్రాంత నగరం యాష్‌కెలెన్‌లోని ఓ సిన్‌గాగ్‌ను తాకిందని తెలిపింది. అయితే, ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదని ఇజ్రాయేల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలిపాయి. గతవారం రోజుల నుంచి ఇజ్రాయేల్, పాలస్తీనా మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. 2014 నుంచి ఇజ్రాయేల్, హమాస్ మధ్య జరుగుతున్న పోరాటంలో అమాయక పాలస్తీనియన్లు బలవుతున్నారు. కాగా, తన 14 ఏళ్లే సర్వీసులో ఇంతటి విధ్వంసాన్ని ఎన్నడూ చూడలేదని గాజా అత్యవసర సహాయక అధికారి సమీర్ అల్-ఖతీబ్ ఆవేదన వ్యక్తం చేశారు. 2014 యుద్ధంలోనూ ఇలా జరగలేదన్నారు. ఇజ్రాయేల్, పాలస్తీనా ఘర్షణపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తచేసింది. పరిస్థితి భయంకరంగా ఉందని, తక్షణమే నిలుపుదల చేయాలని ఐరాస భద్రతా మండలి సమావేశంలో సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ సూచించారు.


By May 17, 2021 at 11:10AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/israel-palestine-conflict-utterly-appalling-as-death-toll-reaches-192-in-gaza/articleshow/82700632.cms

No comments