Breaking News

Delhiలో లాక్‌డౌన్ పొడిగింపు.. మూడు నెలల్లో అందరికీ టీకా Arvind Kejriwal


ఢిల్లీలో లాక్‌డౌన్ మరో వారం పాటు పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. మే 31 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.ఢిల్లీలో కోవిడ్ కేసులు తగ్గుదల ఇలాగే కొనసాగితే, అన్‌లాక్ ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అయితే, అన్‌లాక్ ప్రక్రియ నెమ్మదిగా ఉంటుందని తెలిపారు. పాజిటివిటీ రేటును తగ్గించడానికి నగరం కష్టపడుతున్నందున జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ‘‘కరోనా ప్రస్తుత వేవ్ ఎప్పుడు తగ్గుందో తెలియదు.. కానీ, నెల రోజుల్లో ఢిల్లీ ప్రజల సహకారంతో అదుపులోకి తెచ్చాం.. ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధించినా వైరస్‌పై ఢిల్లీ మొత్తం ఓ కుటుంబం మాదిరిగా పోరాటం చేసింది.. ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత ఉంది.. కానీ, దీనికి కూడా త్వరలో పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నాం’’అని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో కరోనా కట్టడికి గత నెల 18 నుంచి లాక్‌డౌన్ అమలవుతోంది. తొలుత వారం రోజులు విధించిన లాక్‌డౌన్‌ను.. ప్రతివారం పొడిగిస్తూ వస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు మహమ్మారి వ్యాప్తి సృష్టించిన విలయంతో ఢిల్లీలో దయనీయ పరిస్థితులు నెలకున్నాయి. ఆక్సిజన్‌ కొరతతో పలు అస్పత్రుల్లో వందల సంఖ్యలో రోగులు మృతిచెందారు. మృతదేహాలకు అంత్యక్రియల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏప్రిల్ మధ్య నాటికి ఢిల్లీలో పాజిటివిటీ రేటు 35 శాతానికి చేరింది. దీంతో ఆరోగ్య వ్యవస్థలు దాదాపు కుప్పకూలిపోయాయి. కాగా, గతవారం 11.32 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు.. ప్రస్తుతం 2.5 శాతానికి చేరుకుంది. ‘‘ప్రస్తుతం వేవ్ బలహీనపడినట్టు కనిపిస్తోంది.. మనం విజయం సాధించినట్టు కాదు.. కానీ, వైరస్ అదుపులోకి వచ్చింది.. గడిచిన 24 గంటల్లో పాజిటివిటీ రేటు 2.5 శాతంగా ఉంది.. ఒకప్పుడు రోజుకు 28,000 కేసులు నమోదుకాగా.. గత 24 గంటల్లో 1,600కి తగ్గింది’’ అని కేజ్రీవాల్ అన్నారు. ఏప్రిల్ 1 తర్వాత ఢిల్లీలో పాజిటివిటీ రేటు ఇంతలా తగ్గడం ఇదే తొలిసారి. కేసులు తగ్గినా మరణాలు మాత్రం కలవరపెడుతున్నాయి. కేసులు తగ్గడంతో వ్యాక్సినేషన్‌పై దృష్టిసారించామని కేజ్రీవాల్ తెలిపారు. మూడు నెలల్లో ఢిల్లీలోని ప్రతి ఒక్కరికీ టీకా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. కానీ, వ్యాక్సిన్ల కొరత కలవర పెడుతుందని తెలిపారు. ఒకవేళ అందరికీ టీకా వేస్తే.. మూడో దశ వ్యాప్తి నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు.


By May 23, 2021 at 02:09PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/delhi-lockdown-extended-again-says-chief-minister-arvind-kejriwal/articleshow/82877993.cms

No comments