Breaking News

ట్రంప్‌కి కోవిడ్ చికిత్సలో వాడిన కాక్‌టెయిల్‌కు భారత్ అనుమతి.. దీని ప్రత్యేకత ఇదే


గతేడాది అమెరికా ఎన్నికల సమయంలో కోవిడ్ బారినపడ్డ నాటి అధ్యక్షుడు .. మహమ్మారి నుంచి వారం రోజుల్లోనే బయటపడటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, ఆయన అంత త్వరగా కోలుకోడానికి చికిత్సలో ఓ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ఔషధం వాడటమే కారణం. ఈ ఔషధం వినియోగించడంతో ట్రంప్ వేగంగా కోలుకున్నారు. తాజాగా, ఆ ఔషధం భారత్‌లోనూ అందుబాటులోకి రానుంది. స్విట్జర్లాండ్‌ సంస్థ రోచ్‌ తయారు చేసిన ఈ ఔషధానికి సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్సీఓ) అమోదం లభించింది. దిగుమతి చేసుకునే ఈ ఔషధం మార్కెటింగ్‌, పంపిణీ వ్యవహారాలను సిప్లా కంపెనీ చేపట్టనుంది. రెండు రకాల యాంటీబాడీలను అమెరికాకు రీజనరాన్‌ సంస్థతో కలిసి ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తోంది. శరీరంలోకి ఏదైనా రోగకారక క్రిములు ప్రవేశించినప్పుడు దాన్నుంచి రక్షించేందుకు రోగనిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేసే ప్రోటీన్లే యాంటీబాడీలు. టీకా తీసుకున్నా లేదా సహజంగా వ్యాధి సోకినప్పుడు యాంటీబాడీలు విడుదలకు కొద్ది వారాల సమయం పడుతుంది. కాక్‌టెయిల్ డ్రగ్‌‌కు మాత్రం ల్యాబొరేటరీలు లేదా జంతువులపై జరిపిన ప్రయోగాల్లో కోవిడ్‌పై సమర్థంగా పనిచేసిన యాంటీబాడీలను వినియోగిస్తారు. ఇవి నేరుగా శరీరంలోకి ఎక్కించడం ద్వారా వైరస్‌పై తక్షణమే ప్రభావం చూపుతాయని పరిశోధనలో వెల్లడయ్యింది. కోవిడ్‌-19ను ఎదుర్కొనే కాసిరివి మాబ్‌, ఇమ్డివిమాబ్‌ను కలిపి ఈ ఔషధాన్ని అభివృద్ధి చేశారు. REGN-COV2గా పిలిచే ఈ ఔషధం అధిక ముప్పు ఉండి తక్కువ నుంచి మధ్యస్థ లక్షణాలున్న బాధితులకు చికిత్సలో వినియోగిస్తారు. ప్రయోగశాలల్లో అభివృద్ధి చేసిన ఈ రెండు ప్రతినిరోధకాలను మోనోక్లోనల్‌ యాంటీబాడీలుగా పిలుస్తారు. ఇవి మానవ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను అనుకరిస్తూ హానికారక వైరస్‌లను అడ్డుకుంటాయి. సార్స్‌ కోవ్‌-2లోని స్పైక్‌ ప్రోటీన్‌పై సమర్ధంగా పనిచేయడం వీటి ప్రత్యేకత. ఈ ప్రొటీన్‌ను అడ్డుకుంటే శరీరంలోని ఏసీఈ2 కణాలకు వైరస్ అతుక్కోదు. ఈ రెండు యాంటీబాడీలు కలిసి స్పైక్‌ ప్రొటీన్‌లలోని ఒక ప్రత్యేకమైన భాగంపై పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో వైరస్‌లో మ్యుటేషన్ జరిగినా ఇది పనిచేయడం వల్ల కొత్త వేరియంట్లను సమర్థంగా అడ్డుకొనే అవకాశం ఉంది. స్వల్ప, ఓ మోస్తరు లక్షణాలున్న వారికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ ఔషధాన్ని కోవిడ్ బారినపడ్డ 12 ఏళ్ల చిన్నారులకు వినియోగించవచ్చు. అయితే, వీరి బరువు కనీసం 40 కిలోలు ఉండాలి. ఒక్కో యాంటీబాడీ 600 ఎంజీ చొప్పున ఔషధ సమ్మేళనాన్ని 1200 ఎంజీ వినియోగించాలి. చర్మం కింద ఉండే ఒకరకమైన కండరంలో లేదా నరాల ద్వారా ఎక్కించవచ్చు. ఇంటిలో వాడే సాధారణ రిఫ్రిజిరేటర్లలో భద్రపరచవచ్చు. గుండె, కిడ్నీ, డయాబెటిక్ వంటి అనారోగ్య సమస్యలెదుర్కొంటున్నవారికి దీని వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన మూడు ప్రయోగాల్లో ఆస్పత్రుల్లో చేరని 4,567 మంది అత్యధిక ముప్పున్న కొవిడ్‌-19 రోగులపై ప్రయోగించారు. ప్లెసిబో ఇచ్చిన రోగుల కంటే మోనోక్లోనల్‌ యాంటీబాడీలు తీసుకొన్న వారిలోనే సానుకూల ఫలితాలు వచ్చాయి. యాంటీబాడీస్ కాక్‌టెయిల్‌ తీసుకున్నవారు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని దాదాపు 70శాతం తగ్గించింది. అంతేకాదు నాలుగు రోజుల్లో అత్యంత వేగంగా కోలుకొన్నారు. యాంటీబాడీ ఔషధాలు తక్షణమే వైరస్‌పై పోరాటం చేస్తాయి. అదే వ్యాక్సిన్‌ అయితే రోగనిరోధక శక్తిని మేల్కోలిపి వైరస్‌ను నాశనం చేయడానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది. కానీ, దీనికి కాస్త సమయం పడుతుంది. అలాగే యాంటీబాడీ డ్రగ్స్‌ కేవలం వైరస్‌ సోకిన వారికి చికిత్సగా మాత్రమే వినియోగిస్తారు. అదే వ్యాక్సిన్‌ను వ్యాధి బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ఇస్తారు. ఈ ఔషధానికి అమెరికా, ఐరోపా సమాఖ్య అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకుని ఆ డేటా ఆధారంగానే భారత్‌కు కడా అనుమతించింది. దిగుమతులు పూర్తయిన తర్వాత భాగస్వాములతో చర్చించి ధరను నిర్ణయిస్తామని రోచ్‌ ఎండీ సింప్సన్‌ ఇమ్మానియేల్‌ తెలిపారు. అతి త్వరలోనే ఈ డ్రగ్ భారత్‌లో అందుబాటులోకి రానుందని వివరించారు. అలాగే, లోపినావిర్-రిటోనవిర్-రిబావిరిన్ ట్రిపుల్ కాంబినేషన్ ఔషధం ఇంటర్ఫెరాన్ బీటా -1 బి కూడా వైరల్ లోడ్, లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుందని లాన్సెట్ అధ్యయనం పేర్కొంది. సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ రాజేష్ అటల్ ప్రకారం.. రోచె-రెనెగెరాన్ REGN-COV2 ప్రారంభ దశలో SARS-COV2 వైరస్ స్పైక్ ప్రోటీన్ అతిథేయ కణాలకు అంటుకోకుండా చూస్తుంది. ఊబకాయం, అనారోగ్య సమస్యలున్న వృద్ధులు, డయాబెటిక్, మూత్రపిండాల సమస్య, ఇతరత్రా అధిక ప్రమాదం ఉన్న రోగులకు ప్రాధాన్యత ఇవ్వాలి’ అని ఆయన చెప్పారు.


By May 09, 2021 at 12:25PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/monoclonal-antibodies-drug-cleared-for-india-cocktail-donald-trump-used/articleshow/82494624.cms

No comments