Breaking News

మలుపు తిరిగిన నేపాల్ సంక్షోభం.. విపక్షాలు విఫలం.. ప్రధానిగా మళ్లీ ఆయనే!


నేపాల్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం గురువారం మరో మలుపు తిరిగింది. అవిశ్వాస పరీక్షలో ప్రధాని ఓడిపోవడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు విపక్షాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు అన్ని ప్రయత్నాలు చేసిన విపక్షాలు చివరకు చేతులెత్తేశాయి. దీంతో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన తాజా మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలికే అధ్యక్షుడు మరో అవకాశం ఇచ్చారు. మొత్తం 271 స్థానాలున్న నేపాల్ పార్లమెంటులో ఓలి సారథ్యంలోని నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (ఎన్సీపీ)కి 121 మంది సభ్యుల బలముంది. ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్‌ అధినేత షేర్‌ బహదూర్‌ దేవ్‌వా తన నివాసంలో పార్టీ నేతలతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష జనతా సమాజ్‌వాది పార్టీ మద్దతు తమకు లభించే అవకాశాలు ఎంతమాత్రం లేనందున ప్రత్యామ్నాయ సర్కారు ఏర్పాటు సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చారు. కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (మావోయిస్టు సెంటర్‌) స్టాండింగ్‌ కమిటీ సమావేశం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ రాజ్యాంగంలోని 78 (3) అధికరణం ప్రకారం అతిపెద్ద పార్టీ నేతగా ఓలికి మళ్లీ అవకాశం ఇస్తున్నట్టు గురువారం రాత్రి వెల్లడించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చిన గడువు గురువారం రాత్రి 9 గంటలతో ముగిసింది. నేపాల్‌ ప్రధానిగా శుక్రవారం ఓలి మళ్లీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లో ఓలీ తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ ఓలీ మళ్లీ బలపరీక్షలో ఓడిపోతే గనుక పార్లమెంట్‌ను రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళతారు. నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షఉడు షేర్ బహదూర్ దేవ్‌బాకు మాజీ ప్రధాని ప్రచండ, సీపీఎన్ (మావోయిస్ట్) పార్టీ మద్దతు తెలిపింది. అయితే, జనతా సమాజవాదీ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జేఎస్పీ అధ్యక్షుడు ఉపేంద్ర యాదవ్ మద్దతు ప్రకటించినా.. మరో అధ్యక్షుడు మహంత ఠాకూర్ దీనిని వ్యతిరేకించారు. నేపాలీ కాంగ్రెస్ పార్టీకి 61, ప్రచండకు 49, జేఎస్పీకి 32 మంది సభ్యులున్నారు. ఒకవేళ జేఎస్పీ మద్దతు ఉంటే దేవ్‌బా ప్రధాని అయ్యేవారు.


By May 14, 2021 at 09:44AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/kp-sharma-oli-reappointed-as-nepal-pm-as-opposition-fails-to-farm-government/articleshow/82624577.cms

No comments