Breaking News

ప్రమాణస్వీకారానికి సిద్ధమైన మంత్రులు.. దీదీకి గవర్నర్ ఊహించని ఝలక్!


పశ్చిమ్ బెంగాల్ గవర్నర్ , ముఖ్యమంత్రి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. సీఎం, గవర్నర్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలున్నాయి. ఎన్నికల్లో గెలిచి మూడోసారి సీఎంగా మమతా బాధ్యతలు చేపట్టారు. మంత్రివర్గం ప్రమాణస్వీకారానికి సిద్ధమైన వేళ బెంగాల్ గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నరాడా టేపుల వ్యవహారంపై గత క్యాబినెట్‌లోని నలుగురు మంత్రుల పాత్రపై సీబీఐ విచారణకు గవర్నర్ జగదీప్ ధన్ఖడ్ ఆదివారం అనుమతించారు. బెంగాల్‌లో సోమవారం మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయనున్న వేళ.. గవర్నర్ నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. సీబీఐ విచారణకు అనుమతించినట్టు గవర్నర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘ప్రాసిక్యూషన్ కోసం గవర్నర్ అనుమతి ఇచ్చారు ... మమతా మంత్రివర్గంలోని మంత్రులపై విచారణకు ఆర్టికల్ 164 ప్రకారం అనుమతించే అధికారం ఉంది’’ అని ధన్ఖర్ పేర్కొన్నారు. నరాడా కుంభకోణం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మాజీ మంత్రులు సుబార్తా ముఖర్జీ, ఫిర్ఖాద్ హకీమ్‌లకు తాజా క్యాబినెట్‌లోనూ మమతా బెనర్జీ చోటుకల్పించారు. సీఎం మమతా బెనర్జీ మొత్తం 43 మందికి క్యాబినెట్‌లో చోటు కల్పించారు. ఈ జాబితాను ఆదివారం వెల్లడించగా.. సోమవారం వీరంతా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రత్యక్ష పోరాటంగా మారిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఢీకొట్టిన మమతా బెనర్జీ అద్భుతమైన విజయం సాధించిన తరువాత నరాడా కుంభకోణంపై విచారణకు గవర్నర్ అనుమతించడం గమనార్హం. ఇప్పటికే ఈ వ్యవహారంలో అప్పటి తృణమూల్ నేత, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారిపై విచారణకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. ఈ కుంభకోణంపై కమిషన్ నియమించే సమయానికి సువేందు తృణమూల్ ఎంపీగా ఉన్నారు. 2014లో ఢిల్లీ నుంచి కోల్‌కతాకు వచ్చిన ఓ జర్నలిస్ట్.. తనను తాను వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్నారు. బెంగాల్ పెట్టుబడులకు ప్లాన్ చేస్తున్నామని, దీనికి సహకరించాలని ఏడుగురు తృణమూల్ ఎంపీలు, నలుగురు మంత్రులు, ఓ ఎమ్మెల్యే, ఓ పోలీస్ అధికారికి కొంత మొత్తం ఇచ్చినట్టు టేపులు బయటకు వచ్చాయి. 2016 అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ టేపుల వ్యవహారం బెంగాల్‌ను కుదిపేసింది. ఆ తర్వాత ఇది సద్దుమణిగింది. తాజాగా, ఇప్పుడు ఈ టేపుల అంశంపై సీబీఐ విచారణకు గవర్నర్ అనుమతించి వివాదానికి తెరతీశారు. టీఎంసీ ఎమ్మెల్యే మందన్ మిత్రా, తృణమూల్‌ మాజీ నేత సోవన్ ఛటర్జీలపై విచారణకు సీబీఐకి అనుమతించారు. సోవన్ ఛటర్జీ 2019 ఆగస్టులో రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఈ ఏడాది మార్చిలో బీజేపీ నుంచి బయటకొచ్చారు.


By May 10, 2021 at 08:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/as-bengal-ministers-preparation-for-oath-governor-okays-prosecution-in-narada-case/articleshow/82513674.cms

No comments