Breaking News

ఆ ముప్పుపై ఎట్టకేలకు మౌనం వీడిన డ్రాగన్.. అయినా టెన్షన్‌లో ప్రపంచం!


చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ నియంత్రణ కోల్పోయి కక్ష్యలో నుంచి భూమిపైకి దూసుకొస్తుండటం భయాందోళనకు గురిచేస్తోంది. ప్రపంచానికి మరో ముప్పు పొంచి ఉందన్న శాస్త్రవేత్తల హెచ్చరికల నేపథ్యంలో డ్రాగన్ తొలిసారి నోరు విప్పింది. దీని వల్ల నష్టం జరిగే అవకాశాలు చాలా తక్కువని, రాకెట్‌ శకలాలు భూమిని తాకే లోపల.. వాతావరణంలోనే మండిపోతాయని శుక్రవారం పేర్కొంది. లాంగ్‌ మార్చ్‌ 5బి రాకెట్‌ శకలాలు ఈ వారాంతంలోనే భూమిని తాకనున్నాయని హెచ్చరికలపై చైనా తనకేం పట్టనట్టు వ్యవహరించింది. అయితే, విమర్శలు వెల్లువెత్తడంతో తొలిసారి స్పందించింది. రాకెట్‌ శకలాలు భూమిని తాకే లోపలే అవి గాల్లోనే మండిపోతాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ తెలిపారు. దానివల్ల నష్టం జరిగే అవకాశాలు దాదాపు లేవని స్పష్టం చేశారు. ఏప్రిల్ 29న లాంగ్‌ మార్చ్‌ 5బీ రాకెట్‌ స్వీయ అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన ప్రధాన మాడ్యూల్‌ను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టి, ఆ తర్వాత నియంత్రణ కోల్పోయిందని తెలిపారు. ప్రస్తుతం ఈ శకలాలు భూమివైపు దూసుకొస్తున్నాయని తెలిపారు. చాలా వరకు ఉపగ్రహాలు, రాకెట్‌లు భూ వాతావరణంలోకి ప్రవేశించడానికి ముందు మండిపోతాయన్నారు. ఈ కూడా రాకెట్‌ భూ వాతావరణంలోకి ప్రవేశించాక మండిపోతుందని పేర్కొన్నారు. భూమిపై నష్టం జరగడం అనేది దాదాపు ఉండదని అన్నారు. రాకెట్ శకలాలు ఎక్కడ పడొచ్చు? వాటిపై సంబంధిత దేశాలను ముందే హెచ్చరించారా? అన్న ప్రశ్నలకు.. ‘మా అధికారులు ఎప్పటికప్పుడు దీనిపై వివరాలు అందిస్తారు’అని సమాధానం ఇచ్చారు. రాకెట్‌ శకలాలను నిశితంగా గమనిస్తున్నామని వివరించారు. చైనాకు చెందిన పలువురు నిపుణులు మాత్రం ఆ శకలాలు అంతర్జాతీయ జలాల్లో కూలిపోయే అవకాశం ఉందని అంటున్నారు. అమెరికా రక్షణ శాఖ ప్రస్తుతం 5బీ రాకెట్‌ గమనాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. మే 8న ఈ శకలాలు భూమిని చేరే అవకాశం ఉందని పెంటగాన్‌ శాస్త్రవేత్తలు ఇంతకు ముందు అంచనా వేస్తున్నారు. తాజాగా అది ఆదివారం తెల్లవారుజామున చేరుతుందని భావిస్తున్నారు. అయితే అది సరిగ్గా ఏ ప్రదేశంలో భూ వాతవరణంలోకి ప్రవేశిస్తుందో అంచనా వేయలేకపోతున్నారు. ఈ రాకెట్‌ను అమెరికా సైన్యం కూల్చివేయడానికి ప్రయత్నిస్తోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆ దేశ రక్షశాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ స్పందించారు. రాకెట్‌ను కూల్చివేసే సామర్థ్యం ఉన్నా అటువంటి ప్రయత్నాలేవీ తాము చేయడంలేదన్నారు. సముద్ర జలాలు లేదా భూమిపై ఏ ప్రాంతంలో పడినా ఎవరికీ ఎటువంటి హాని జరగకుండా ఉండాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. కానీ, చైనా నిర్లక్ష్యం వల్లే రాకెట్ నియంత్రణ కోల్పోయి కక్ష్య నుంచి దూసుకొస్తుందని అన్నారు.


By May 08, 2021 at 11:07AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/china-says-extremely-low-risk-of-damage-from-long-march-5b-rocket-debris/articleshow/82475684.cms

No comments