Breaking News

బిహార్‌లో సంపూర్ణ లాక్‌డౌన్.. నేటి రాత్రి నుంచే అమల్లోకి


దేశంలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. అంతకు ముందుతో పోల్చితే గత మూడు రోజులుగా కేసులు స్వల్పంగా తగ్గాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌లో వైరస్ తగ్గుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే, మహారాష్ట్రలో వైరస్ తగ్గుముఖం పట్టడానికి లాక్‌డౌన్ విధించడం కూడా తోడ్పడింది. కాగా, కోవిడ్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని, పూర్తి అధికారాలను రాష్ట్రాలకే కేంద్రం అప్పగించింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా సాగుతున్నాయి. ఢిల్లీ, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ కొనసాగుతోంది. తాజాగా, ఈ జాబితాలో బిహార్ చేరింది. మే 15 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు బిహార్ ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై క్యాబినెట్ మంత్రులు, అధికారులతో సోమవారం చర్చించిన తర్వాత లాక్‌డౌన్ అమలుచేయాలని నిర్ణయించినట్టు నితీశ్ తెలిపారు. దీనికి లాక్‌డౌన్‌కు సంబంధించిన విధి విధానాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. ‘‘నిన్న క్యాబినెట్‌లోని మంత్రులు, అధికారులతో చర్చించిన తరువాత మే 15 వరకూ బీహార్‌లో లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించాం... దీనిపై వివరణాత్మక మార్గదర్శకాలు, ఇతర కార్యకలాపాలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోవిడ్ సంక్షోభ నిర్వహణ బృందానికి సూచించాం’’ అని బిహార్ సీఎం నితీశ్ వెల్లడించారు. బిహార్‌లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతుండటంతో వైరస్ వ్యాప్తి కట్టడికి లాక్‌డౌన్ అమలకు నితీశ్ మొగ్గుచూపారు. గడచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 11,407 కేసులు, 82 మరణాలు నమోదయ్యాయి. దీంతో బిహార్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5 లక్షలు దాటగా.. మరణాలు 2,800కి చేరాయి. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 3,57,229 కేసులు, 3,449 మరణాలు చోటుచేసుకున్నాయి.


By May 04, 2021 at 12:32PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bihar-imposes-total-lockdown-till-may-15-says-nitish-kumar/articleshow/82384046.cms

No comments