Breaking News

ప్రధాని బ్రేక్‌ఫాస్ట్ బిల్లులపై రగడ.. పోలీసుల దర్యాప్తు.. వివాదానికి కారణం ఇదే!


ఫిన్లాండ్ ప్రధాని బ్రేక్‌ఫాస్ట్ బిల్లులపై దుమారం రేగుతోంది. తనతోపాటు ప్రధాని బ్రేక్‌ఫాస్ట్ బిల్లులకు చట్టవిరుద్ధంగా ప్రజా ధనాన్ని వినియోగించినట్టు స్థానిక పత్రిక ఇటేలేహ్తి ప్రచురించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఫిన్లాండ్ పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నట్టు శుక్రవారం ప్రకటించారు. తన అధికారిక నివాసం కేసరంతలో కుటుంబం బ్రేక్‌ఫాస్ట్ కోసం నెలకు సుమారు 300 యూరోలు (365 డాలర్లు) ఛార్జ్ చేసినట్టు మంగళవారం ప్రచురించిన కథనంలో ఆరోపించింది. దీంతో ఫిన్‌లాండ్ ప్రధాని ఇరుకునపడ్డారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. అంతేకాదు, ప్రధాని తన కుటుంబంలోని పెద్దలకు కూడా అలవెన్స్‌లు ఇవ్వాలని పట్టుబట్టారని వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలపై స్పందించిన ప్రధాని మారిన్ ‘ఓ ప్రధానిగా నాకు నేనుగా ఇలాంటి ప్రయోజనాలు కావాలని కోరలేదు, పట్టుబట్టలేదు.. ఈ నిర్ణయంలో భాగస్వామిని కాలేదు’ అని పేర్కొన్నారు. అయితే ప్రధాని బ్రేక్‌ఫాస్ట్ కోసం ప్రజా ధనాన్ని వాడటం దేశ చట్టాలకు విరుద్దమని ఆ దేశ న్యాయనిపుణులు అంటున్నారు. ఈ సమస్యను పరిశీలించాలని పోలీసులకు శుక్రవారం ఓ అభ్యర్థన రాగా.. పబ్లిక్-ఆఫీస్ నేరంపై ముందస్తు విచారణ దర్యాప్తును ప్రకటించారు. ‘చట్టప్రకారం ప్రధాని భోజన ఖర్చు ఆమె జీతంలో భాగమే అయినప్పటికీ.. కొన్నింటిని రీయింబర్స్ చేశారు ’’ అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ‘ప్రధాని కార్యాలయం అధికారుల నిర్ణయాలపై తమ దర్యాప్తు దృష్టి సారిస్తుందని, దీంతోపీఎం లేదా ఆమె అధికారిక కార్యకలాపాలకు ఎటువంటి సంబంధం లేదు’ అని డిటెక్టివ్ సూపరింటెండెంట్ తీము జోకినెన్ ఒక ప్రకటనలో తెలిపారు. దర్యాప్తును స్వాగతిస్తున్నామని, నిజమని తేలితే ఆ ప్రయోజనాలను సీజ్ చేస్తానని ప్రధాని మారిన్ శుక్రవారం ట్విట్టర్‌లో తెలిపారు. 2019 డిసెంబరులో అధికారం చేపట్టిన సానా మారిన్‌కు ప్రజల మద్దతు భారీగా ఉంది. ఐరోపాలో కరోనా కట్టడికి సమర్థవంతంగా పనిచేసిన దేశాల్లో ఫిన్‌లాండ్ ఒకటికాగా.. ప్రపంచవ్యాప్తంగా ఆమె పనీతీరుకు ప్రశంసలు దక్కాయి. అయితే, జూన్ 13న స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతుండగా.. ఈ ఆరోపణలు రావడం గమనార్హం. కానీ, ఇప్పటికే ఆమె పార్టీ మళ్లీ రికార్డుస్థాయిలో విజయం సాధిస్తుందని అంచనాలున్నాయి.


By May 29, 2021 at 11:24AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/police-to-probe-finland-prime-minister-sanna-marin-breakfast-bill/articleshow/83057539.cms

No comments