Breaking News

Black Fungus హరియాణాలో మరణమృదంగం.. ఒక్క రోజే 18 మంది మృతి


దేశంలో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తుంటే.. ఇదే తరుణంలో ఫంగస్‌లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్నామనే సంతోషాన్ని బ్లాక్ ఫంగస్ ఆవిరిచేస్తోంది. కోవిడ్ బారినపడి చాలా మందిని ఫంగస్‌లు వేధిస్తున్నాయి. దేశంలో అత్యధికంగా గుజరాత్‌లో నమోదుకాగా.. తర్వాత మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఉన్నాయి. కాగా, హరియాణాలో గత 24 గంటల్లోనే 18 , 133 కేసులు నమోదుకావడం మరింత కలవరానికి గురిచేస్తోంది. హరియాణాలో ఇప్పటి వరకూ 756 మందికి బ్లాక్ ఫంగస్ నిర్ధారణ అయ్యింది. కాగా, వీరిలో 648 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 58 మంది కోలుకున్నారు. హరియాణాలో బ్లాక్ ఫంగస్ గురువారం నాటికి ఇవి 32 ఉండగా.. శుక్రవారానికి ఈ సంఖ్య 50కి చేరింది. నిన్న ఒక్క రోజే 18 మంది మృతిచెందారు. మరోవైపు, హ‌రియాణాలో కరోనా వ్యాక్సిన్‌తో పాటు బ్లాక్‌ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా ఉంది. ఏప్రిల్ చివరి వారంలో రాష్ట్రానికి 66 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ల‌కు ఆర్డ‌ర్ చేయగా, దానిలో ఐద‌వ వంతు మాత్రమే అందాయి. క‌రోనా వ్యాక్సిన్లు, బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కొరతను తీర్చడానికి హరియాణా ప్రభుత్వం గ్లోబల్ టెండర్‌ను ఆహ్వానించింది. కరోనా వ్యాక్సిన్ కోటి డోసులు, 15 వేల‌ బ్లాక్ ఫంగ‌స్ ఇంజెక్షన్ల కోసం టెండర్లు పిలిచింది. అయితే, బ్లాక్ ఫంగస్ బాధితులకు చికిత్సలో వాడే యాంటీ-ఫంగల్ ఔషధం ‘అంపోటెరిసిన్‌ బి లిపోజమ్‌’ హరియాణాలో తగినంత అందుబాటులో లేకపోవడంతో వైద్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. దీనిని సకాలంలో గుర్తించి, రోజుకు నాలుగుసార్లు అంపోటెరిసిన్‌ బి లిపోజమ్‌ ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ, హరియాణాలో ఈ ఔషదానికి తీవ్ర కొరత ఏర్పడటం వల్ల రోజుకు రెండుసార్లు ఇవ్వాలని హరియాణా నిపుణుల కమిటీ రెండు రోజుల కిందట సూచించింది. అయితే, ఈ సిఫార్సులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాద్రిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో మే 23న చేరిన బ్లాక్ ఫంగస్ బాధితుడికి.. 26న కేవలం రెండు డోస్‌లు మాత్రమే ఇచ్చినట్టు అతడి బంధువులు ఆరోపించారు. మే 25 వరకు హరియాణాలో 436 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని, ఆ రాష్ట్రానికి 1,110 అంపోటెరిసిన్-బి అందజేశామని కేంద్రం తెలిపింది.


By May 29, 2021 at 10:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/18-patients-of-black-fungus-have-died-in-a-single-day-in-haryana/articleshow/83057056.cms

No comments