Breaking News

బర్త్‌డే పార్టీలో బాయ్ ఫ్రెండ్ కాల్పులు.. ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి


అమెరికాలో మరోసారి గన్ కల్చర్ పడగవిప్పి 11 మందిని పొట్టనబెట్టుకుంది. కొలోరడోలోని ఓ మొబైల్‌ హోం పార్క్‌ వద్ద పుట్టిన రోజు వేడుకల్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలిలోనే ఆరుగురు మృతిచెందగా.. చికిత్స పొందుతూ మరో వ్యక్తి చనిపోయినట్లు అధికారులు తెలిపారు. నిందితుడ్ని పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న కుటుంబంలోని ఓ యువతి బాయ్ ఫ్రెండ్‌గా పోలీసులు గుర్తించారు. ఆదివారం అర్ధరాత్రి వేడుకలు జరుగుతున్న సమయంలో అక్కడికి ప్రవేశించిన దుండగుడు కాల్పులు జరిపాడని, అనంతరం తనను తాను కాల్చుకున్నాడని వివరించారు. గాయాలతో ఉన్న అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. అతడు అక్కడ చనిపోయాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డాడనేది విచారణలో వెల్లడవుతుందన్నారు. ఈ ఘటనలో చిన్నారులు ఎవరూ గాయపడలేదు, వారిని కుటుంబసభ్యులు నిందితుడి కంటబడకుండా జాగ్రత్త వహించారని వివరించారు. అతడు ఎవరనేది బాధితులు గుర్తించలేదని పేర్కొన్నారు. ఈ ఘటన చాలా దిగ్భ్రాంతికి గురిచేసిందని కొలొరడో పోలీస్ అధికారి విన్స్ నిస్కీ అన్నారు. ఇటువంటి ఘటన ఎన్నడూ జరక్కూడదని వ్యాఖ్యానించారు. ‘ఇది మూర్ఖత్వపు హింస’ అని కొలొరడో గవర్నర్ జాన్ సుథేర్స్ మండిపడ్డారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాల్పుల శబ్దానికి ఉలిక్కిపడి లేచిన ఓ మహిళ.. వాటిని ఉరుములుగా భావించినట్టు స్థానిక మీడియా తెలిపింది. అక్టోరు 2015 నుంచి జరిగిన మూడో అతిపెద్ద కాల్పుల ఘటన ఇది. 2015 అక్టోబరులో రాండమ్ హలోవీన్ కాల్పులు, అదే ఏడాది నవంబరులో పేరెంట్‌హుల్ క్లినిక్ కాల్పుల ఘటన తర్వాత ప్రస్తుత ఘటన అత్యంత పెద్దది. ఉడ్‌ల్యాండ్‌లో ఓ వ్యక్తి ఇరుగుపొరుగువారిపై కాల్పులకు పాల్పడిన ఘటనలో మరో ముగ్గురు మృతిచెందారు. నిందితుడు వారి ఇళ్లలోకి ప్రవేశించి కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన తర్వాత నిందితుడు ఆ ఇంటికి నిప్పంటించినట్లు తెలిపారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో నిందితుడు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. అమెరికాలో గతేడాది కాల్పుల ఘటనల్లో 43 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.


By May 10, 2021 at 12:20PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/11-dead-in-colorado-and-woodland-shooting-suspect-was-a-victims-boyfriend/articleshow/82516617.cms

No comments