Breaking News

బాలికల స్కూల్ వద్ద బాంబు పేలుళ్లు.. 30 మందికిపైగా మృతి


అంతర్యుద్ధంతో నలిగిపోతున్న అఫ్గానిస్థాన్‍‌ మరోసారి ఉగ్రదాడులతో దద్దరిల్లింది. రాజధాని కాబూల్‌లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 30 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాబూల్‍లోని బాలిక పాఠశాల సమీపంలో ఈ బాంబు పేలుడు చోటుచేసుకుంది. మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్టు అఫ్గన్ ప్రభుత్వం ప్రకటించింది. పేలుడు ఘటనలో మరో 50 మందికి తీవ్రగాయాలైనట్టు తెలిపింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే, ఈ బాంబు పేలుడుతో తమకు సంబంధం లేదని తాలిబన్లు ప్రకటించారు. బాంబు పేలుడులో ప్రాణాలు కోల్పోయినవారిలో 11 నుంచి 15 ఏళ్లలోపు చిన్నారులే ఎక్కువగా ఉన్నారని అఫ్గన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి తారీఖ్ అరియన్ తెలిపారు. పౌరులే లక్ష్యంగా ఈ బాంబు దాడికి పాల్పడినట్టు పేర్కొన్నారు. అఫ్గన్‌లో గత 20 ఏళ్లుగా ఉన్న అమెరికా, నాటోలు తమ దళాలను ఉపసంహరించుకుంటోన్న వేళ వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు వేర్వేరు పేలుళ్లు సంభవించాయి. అయితే, అధికారులు వీటిని ధ్రువీకరించలేదు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. రహీమీ అనే స్థానిక వ్యక్తి అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ.. బాంబు పేలుడు తర్వాత పాఠశాలలోని బాలికలు ఆర్తనాదాలు చేస్తూ బయటకు పరుగులెత్తారని తెలిపారు. బాంబు పేలుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జనం అంబులెన్స్‌లపై దాడి చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడానికి ప్రయత్నించగా ఆరోగ్య కార్యకర్తలపై కూడా భౌతిక దాడులకు దిగారు. ఇటీవల బాంబు పేలుళ్లతో తాలిబన్లు, అఫ్గన్ ప్రభుత్వం మధ్య జరుగుతున్న శాంతి చర్చలు వాయిదాపడ్డాయి. కాగా, 20 ఏళ్లుగా అఫ్గానిస్తాన్‌లో ఉన్న అమెరికా, బ్రిటన్ సేనలు ఆ దేశాన్ని వీడుతున్నాయి. అక్కడ మిగిలిన 2500-3500 మంది అమెరికా సైనికులు సెప్టెంబర్ 11 నాటికి తిరిగి స్వదేశానికి చేరుకుంటారని ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. బ్రిటన్ కూడా తమ 750 మంది సైనికులను వెనక్కు పిలిచింది.


By May 09, 2021 at 09:00AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/at-least-30-killed-and-50-injured-in-afghan-terror-attack/articleshow/82492896.cms

No comments