Breaking News

గంగానదిలో రెండు పడవలు ఢీ.. 26 మంది జలసమాధి


గంగా నదిలో పడవ ప్రమాదం చోటుచేసుకుని 25 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. మధ్య బంగ్లాలోని షిబ్‌చర్ పట్టణం వద్ద పద్మా నదిలో సోమవారం ఉదయం ప్రయాణికులతో వెళ్తోన్న పడవను ఇసుక తీసుకెళ్లే బోటు ఒకదానికొకటి ఢీకొట్టాయి. దీంతో అందులోని 26 మంది నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. పడవల్లో 30మందికిపైగా ఉండగా, వారిలో ఐదుగురిని రక్షించినట్టు బంగ్లాదేశ్ పోలీసు చీఫ్ మీరజ్ హోసేన్ తెలిపారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నదిలో మునిగిపోయిన వారి కోసం గాలింపు చేపట్టారు. నిర్వహణ సరిగా లేకపోవడం, సామర్థ్యానికి మించి పడవలో ఎక్కడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని బంగ్లాదేశ్ పోలీసులు పేర్కొన్నారు. గల్లంతయినవారి కోసం గాలిస్తున్నట్టు వివరించారు. బంగ్లాదేశ్‌లో తరుచూ ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత నెలలో నారాయణగంజ వద్ద 50 మందితో వెళ్తోన్న ఓ పడవ బోల్తాపడిన ఘటనలో 30 మంది మరణించారు. గత ఏడాది జూన్‌లోనూ ఢాకా సమీపంలో జరిగిన పడవ ప్రమాదంలో 32 మంది జలసమాధి అయ్యారు. ఇక, 2015 ఫిబ్రవరిలో జరిగిన షిప్ ప్రమాదంలో 78 మంది మృత్యువాత పడ్డారు. బంగ్లా‌దేశ్‌‌లో పడవ ప్రమాదాలకు నిర్వహణ సక్రమంగా లేకపోవడం, భద్రత ప్రమాణాలు పాటించకపోవడం, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇసుక తవ్వకాలు కూడా ప్రమాదాలకు హేతువుగా మారుతున్నాయి. భారత్‌లో ప్రవహించే అనేక నదులు బంగ్లాదేశ్ వద్ద సముద్రంలో కలుస్తున్నాయి. గంగా నదికి అక్కడ పద్మా అని పేరుతో పిలుస్తారు.


By May 03, 2021 at 12:25PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/atleast-25-killed-in-collision-between-two-boats-say-bangladesh-police/articleshow/82366908.cms

No comments