Breaking News

శుభవార్త చెప్పిన కేంద్రం.. ఆగస్టు- డిసెంబరు మధ్య 216 కోట్ల టీకాలు


కరోనా మహమ్మారి సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న దేశ ప్రజానికి కేంద్రం ఒకింత ఊరట కలిగించే వార్తను చెప్పింది. ప్రస్తుతం ఎదుర్కొంటున్న టీకా కొరతను అధిగమించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. త్వరలోనే కొత్త వ్యాక్సిన్లకు అనుమతులు ఇవ్వనున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్లకు పైగా వివిధ వ్యాక్సిన్ డోస్‌లు అందుబాటులోకి రానున్నట్టు వెల్లడించింది. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వీ వచ్చే వారమే దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు పేర్కొంది. నీతి-ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది ఆగస్టు-డిసెంబర్‌ మధ్య 216 కోట్ల డోసులు అందుబాటులోకి రానున్నాయని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ తెలిపారు. వీటిలో భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన సింగిల్‌ డ్రాప్‌, సింగిల్‌ డోస్‌ నాసల్‌ వ్యాక్సిన్లు కూడా ఉంటాయని వివరించారు. ఇప్పటివరకు దేశంలో దాదాపు 18 కోట్ల డోసులు అందజేశామని, జులై నాటికి ఇది 35.6 కోట్లకు చేరుతుందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సినేషన్ వేసిన దేశాల జాబితాలో అమెరికా, చైనాల తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉందన్నారు. ‘‘దేశంలో ఇప్పటివరకు 13.76 కోట్ల మంది తొలి డోస్, 3.96 కోట్ల మంది రెండో డోస్ తీసుకున్నారు. 45 ఏళ్లు దాటినవారు దేశవ్యాప్తంగా 34 కోట్ల మంది ఉండగా, వారిలో 1/3వ వంతు మందికి ఒక డోస్ అందింది. కొవిడ్‌ మృతుల్లో 88% మంది ఈ వయస్సు వాళ్లే కావడం వల్ల వీరికి టీకాను ఇవ్వడం వల్ల మరణాల రేటు తగ్గే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు 35.6 కోట్ల డోస్‌లను కొనుగోలు చేశాం... వీటిలో 19.6 కోట్ల వినియోగం ఈ నెలాఖరుకల్లా పూర్తవుతుంది. మిగిలిన 16 కోట్ల డోసులు మే-జులై మధ్యలో అందుతాయి. వాటికి ఇప్పటికే చెల్లింపులు పూర్తయ్యాయి. మరో 16 కోట్ల డోసులను రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు కలిసి సేకరిస్తున్నాయి. మొత్తంగా జులై నాటికి 51.6 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయి’’ అని అన్నారు. రష్యాకు టీకా స్పుత్నిక్‌- వీ వచ్చే వారం మార్కెట్‌లో అందుబాటులోకి రానుందని, జులై నుంచి దేశంలో దాని ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పెంచామని, 18 ఏళ్లు నిండినవారు మన దేశంలో 95 కోట్ల మందికి పైగా ఉన్నారన్నారు. వీరికి రెండు డోస్‌లు అందించడానికి దాదాపు 200 కోట్ల డోసులు అవసరమవుతాయన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), అమెరికా ఎఫ్‌డీఏ అనుమతులు పొందిన ఏ విదేశీ టీకాలైనాసరే భారత్‌కు రావొచ్చని, అవి దిగుమతి లైసెన్సులు అడిగితే రెండు రోజుల్లో ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌లతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. సాంకేతికత బదిలీ ద్వారా భారతీయ కంపెనీలతో పనిచేయాలని వాటిని ఆహ్వానిస్తున్నామన్నారు. 45 ఏళ్లు నిండినవారిలో దేశంలో సగటున 32% మందికి కనీసం ఒక డోస్‌ వ్యాక్సిన్‌ అందింది. ఆగస్టు-డిసెంబరు మధ్య కోవిషీల్డ్ 750 మిలియన్లు, కొవాగ్జిన్ 550 మిలియన్లు, బయలాజికల్ ఈ టీకా 300 మిలియన్లు, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ నోవావ్యాక్స్ 200 మిలియన్లు, స్పుత్నిక్-వీ 156 మిలియన్లు, బీబీ నాసల్ టీకా 100 మిలియన్లు, జెన్నోవా ఎంఆర్ఎన్ఏ టీకా 60 మిలియన్లు, జైడస్ కాడిల్లా డీఎన్ఏ టీకా 50 మిలియన్లు అందుబాటులోకి రానున్నాయి. బయలాజికల్ ఈ, జైడస్, జెన్నోవా, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ పలు దశల్లో ఉన్నాయి. వచ్చే ఏడాది తొలి త్రైమాసికానికి దేశంలోని ప్రజలకు అవసరమైన టీకాలు అందుబాటులోకి రానున్నాయని డాక్టర్ వీకే పాల్ తెలిపారు.


By May 14, 2021 at 07:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-to-have-over-2-billion-vaccine-doses-during-august-december-says-centre/articleshow/82622795.cms

No comments