Breaking News

కరోనాతో జీవాయుధాలు.. 2015లో చర్చించిన చైనా.. డ్రాగన్ గుట్టురట్టు చేసిన ఆ పత్రిక!


ప్రపంచాన్ని అల్లాడిస్తున్న కరోనా వైరస్ తొలిసారిగా చైనాలోని వుహాన్‌లో వెలుగుచూడటంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. వుహాన్ ల్యాబ్‌లోనే కరోనా పుట్టందని అంతర్జాతీయ మీడియాలో విస్తృత కథనాలు వెలువడ్డాయి. తాజాగా, కరోనా గురించి ఆరేళ్ల కిందటే చైనా శాస్త్రవేత్తలు చర్చించినట్టు, వైరస్‌తో జీవాయుధాల తయారుచేయడంపై ప్రస్తావించినట్టు ఓ అంతర్జాతీయ వెబ్ పత్రిక సంచలన కథనం ప్రకటించింది. కరోనా వైరస్‌తో ఆయుధాలను తయారీపై 2015లోనే చైనా శాస్త్రవేత్తలు చర్చించారని పేర్కొంది. సార్స్‌- కోవి-2 వైరస్‌లు ఆధునిక జీవాయుధాలా? ఇప్పటికే మనుషుల్లో వ్యాధికారక వైరస్‌లోకి దీనిని కృత్రిమంగా చొప్పించి ఆయుధాలుగా మలచుకోవచ్చా? అంటే అవునంటోంది ఆస్ట్రేలియా న్యూస్ వెబ్‌సైట్ ‘News.com.au’ పత్రిక కథనం. ‘సార్స్ కృత్రిమ పుట్టుక, మానవులు సృష్టించిన కొత్త జాతుల జీవాయుధం’ (The Unnatural Origin of SARS and New Species of Man-Made Viruses as Genetic Bioweapons) అనే పేరుతో కథనం ప్రచురించింది. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం జరిగితే అది జీవాయుధాలతోనే అని చైనా శాస్త్రవేత్తలు, ఆరోగ్య అధికారులు ఒక పత్రంలో రాసినట్లు తెలిపింది. సార్స్‌- కరోనా వైరస్‌లను నూతన శకం జన్యు ఆయుధాలుగా డ్రాగన్‌ అభివర్ణించినట్టు పేర్కొంది. జీవాయుధంతో దాడి చేస్తే శత్రుదేశం వైద్య వ్యవస్థ కుప్పకూలిపోతుందని చైనా సైన్యం భావిస్తోందని వ్యాఖ్యానించింది. కరోనా 2019లో వ్యాప్తి చెందినప్పటికీ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (సీపీఎల్ఏ) శాస్త్రవేత్తలు ఇలాంటి వైరస్‌తో ఆయుధాల తయారీ గురించి అంతకు ఐదేళ్ల ముందు నుంచే చర్చిస్తున్నట్టు కథనంలో వివరించింది. దీనికి సంబంధించిన ఆధారాలు, పత్రాలు అమెరికా విదేశీ వ్యవహారాల శాఖకు లభ్యమైనట్లు మరికొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కొవిడ్‌-19పై పుట్టుకపై స్వీయ దర్యాప్తులో భాగంగా అమెరికా అధికారులకు ఈ పత్రాలు చేజిక్కినట్లు తెలిపాయి. సీపీఎల్ఏ కమాండర్లు ఎంతటి దుర్మార్గాలకు పాల్పడతారో ఇవి రుజువు చేస్తున్నాయని యూకే పత్రిక ‘ద సన్‌’ పేర్కొంది. వుహాన్‌ వైరస్‌ వెనుక రహస్యాలను వెల్లడించేలా త్వరలో ఒక పుస్తకాన్ని వెలువరించనున్నారు. వివిధ రకాల వైరస్‌లను సైనిక అవసరాలకు ఎలా వాడుకోవచ్చేనేది శాస్త్రవేత్తలు ఆలోచించడం సుస్పష్టమని ‘ఆస్ట్రేలియన్ స్ట్రాటజీక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్’ (ఏఎస్‌పీఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీటర్‌ జెన్నింగ్స్‌ వ్యాఖ్యానించారు. సైనిక అవసరాలకు ఉద్దేశించిన వ్యాధికారక క్రిమి ప్రమాదవశాత్తూ ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందనే వాదనకు ఇది బలం చేకూరేలా ఉందని అన్నారు. ‘వుహాన్‌ మార్కెట్‌ నుంచి వైరస్‌ వ్యాపించి ఉంటే దానిపై దర్యాప్తునకు చైనా సహకరించేది. కానీ వైరస్‌ మూలాల్లోకి వెళ్లాలన్న ప్రయత్నాన్ని డ్రాగన్‌ వ్యతిరేకించింది’ అని చైనా నిరాకరించిన విషయాన్ని గుర్తుచేశారు. చైనా ప్రభుత్వ డాక్యుమెంట్లు లీకైనప్పుడు వాటిని విశ్లేషించే సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు రాబర్ట్‌ పోటర్‌.. తాజా పత్రం నకిలీది కాదని తేల్చడం గమనార్హమని అన్నారు. డ్రాగన్ పరిశోధకుల ఆలోచన విధానం ఎలా ఉందో ఈ పత్రం వెల్లడిస్తుందని జెన్సింగ్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ కథనంలో నిజం లేదని, తమపై బురదజల్లే ప్రయత్నమని చైనా తోసిపుచ్చింది. ‘ఇది అసలైందని మేము నిర్ధారణకు వచ్చాం... ఇది నకిలీ కాదు కాని అది ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవడం వారిపైనే ఆధారపడింది’ అని పరోక్షంగా చైనాను ఉద్దేశించి పోటర్ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది కొన్నేళ్ల కిందటే ఉద్భవించింది ... వారు (చైనా) దాన్ని తొలగించడానికి దాదాపు ఖచ్చితంగా ప్రయత్నిస్తారు.. చైనా పరిశోధనా పత్రాలు జీవాయుధాల గురించి చర్చించడం అసాధారణం కాదు.. దీనిపై పురోగతి సాధించాల్సిన అవసరం ఉంది’అని పోటర్ పేర్కొన్నాడు. ‘చైనా పరిశోధకులు ఏలా ఆలోచిస్తున్నారో తెలియజేయడానికి ఇది నిజంగా ఆసక్తికరమైన కథనం’ అని ఆయన చెప్పారు. డిసెంబరు 2019లో తొలిసారిగా వుహాన్‌లోనే కోవిడ్ వెలుగుచూసింది. అక్కడ నుంచి ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఇప్పటి వరకూ దాదాపు 16 కోట్ల మంది కోవిడ్ బారినపడగా.. 3.28 మిలియన్ల మంది బలయ్యారు.


By May 10, 2021 at 08:00AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/chinese-scientists-discussed-weaponising-coronavirus-in-2015-says-australian-report/articleshow/82513142.cms

No comments