Breaking News

తమిళనాడులో సంపూర్ణ లాక్‌డౌన్.. మే 10 నుంచి అమల్లోకి


దేశంలో కరోనా వైరస్ పట్టపగ్గాల్లేకుండా వ్యాపిస్తోంది. మహమ్మారి నియంత్రణకు పలు రాష్ట్రాలు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నాయి. కొన్ని చోట్ల కరోనా కర్ఫ్యూలు, వారాంతపు లాక్‌డౌన్‌లు అమలవుతున్నా వైరస్ తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. తాజాగా, తమిళనాడు సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మే 10 నుంచి 24 వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు డీఎంకే ప్రభుత్వం వెల్లడించింది. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తమిళనాడు సీఎంగా ఎంకే స్టాలిన్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొవిడ్‌ వ్యాప్తిని అడ్డుకోడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రెండు వారాల పాటు రాష్ట్రంలో పూర్తిస్థాయి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే కలెక్టర్లతో శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా సమస్య పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు చేపట్టాలని స్టాలిన్‌ ఆదేశించారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, రాబోయే రెండు వారాల్లో పాజిటివ్ కేసుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉన్నందున కఠిన చర్యల ద్వారా వైరస్‌ను అడ్డుకోగలమని సూచించారు. వైద్య సిబ్బందిని అదనంగా నియమించుకోవడానికి అధికారాలను ఇచ్చారు. ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, రోజువారీ కరోనా కేసుల సంఖ్య 25వేలకు చేరుకుందని సీఎం గుర్తుచేశారు. ఆస్పత్రుల్లో పడకల సౌకర్యం, ఆక్సిజన్‌ వసతి వంటివాటిని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. అధికారులందరూ సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. పొగడ్తల ప్రసంగాలు తాను వినదలచుకోలేదని, పనితీరు మెరుగుపరుచుకోవాలని ఉద్బోధ చేశారు. 45 ఏళ్లు దాటినవారు స్వచ్ఛందంగా ముందకొచ్చి వ్యాక్సిన్లు వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గడచిన 24 గంటల్లో తమిళనాడులో 26,465 కొత్త కేసులు బయటపడగా.. మరో 192 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల తర్వాత అక్కడ క్రమంగా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.


By May 08, 2021 at 10:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tamil-nadu-govt-announces-two-weeks-complete-lockdown-from-may-10th/articleshow/82474941.cms

No comments