Breaking News

మూడు రోజుల్లో ఉపఎన్నిక.. ఎమ్మెల్యే అభ్యర్థి మరణం.! విషాదం


ఎన్నికల బరిలో దిగి హోరాహోరీ ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థిని విషాదం వెంటాడింది. ఆరోగ్యం దెబ్బతినడంతో ఆస్పత్రిలో చేరిన ఆయన తిరిగిరాలేదు. కరోనా రక్కసికి బలైపోయారు. తనకు కరోనా సోకిందని.. ఆరోగ్యంగా తిరిగి వస్తానని చెప్పిన ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మరో మూడు రోజుల్లో ఉపఎన్నిక జరగాల్సి ఉండగా అనూహ్యంగా అభ్యర్థి మరణంతో ఎన్నిక వాయిదా పడింది. ఈ అత్యంత విషాద ఘటన ఒడిశాలో జరిగింది. పూరీ జిల్లాలోని పిపిలీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి అజిత్ మంగరాజ్(52) అనూహ్యంగా మృతి చెందారు. హోరాహోరీ ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ నెల 7 అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రిలో చేరిన అజిత్‌కి 10న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకిందని.. ఆరోగ్యంగా తిరిగి వస్తానని అభిమానుల కోసం అజిత్ ఫేస్‌బుక్‌‌లో పోస్ట్ చేశారు. అయితే ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పిపిలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బీజేడీ నేత ప్రదీప్ మహారథి మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లోనూ పోటీ చేసిన అజిత్ మంగరాజు ప్రదీప్ చేతిలో ఓటమి పాలయ్యారు. బీజేడీ ఎమ్మెల్యే మరణానంతరం ఉప ఎన్నిక అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అజిత్ మంగరాజుకే టిక్కెట్ కేటాయించింది. బీజేడీ నుంచి ప్రదీప్ వారసుడు రుద్ర మహారథి, బీజేపీ నుంచి అశ్రిత్ పట్నాయక్ బరిలో ఉన్నారు. అజిత్ అనూహ్య మరణంతో ఉప ఎన్నిక వాయిదా పడింది. అజిత్ మంగరాజు మరణంతో ఈ నెల 17న జరగాల్సిన ఉప ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఆ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుశీల్ లొహానీ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందించినట్లు చెప్పారు. ఉప ఎన్నిక తేదీ త్వరలో ప్రకటిస్తామని.. మరో అభ్యర్థి నామినేషన్‌కు అవకాశం ఉంటుందని ఆయన తెలియజేశారు. అజిత్ మంగరాజు మరణం పట్ల గవర్నర్ గణేషీ లాల్, సీఎం నవీన్ పట్నాయక్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు సంతాపం తెలియజేశారు. Also Read:


By April 15, 2021 at 03:11PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/odisha-pipili-bypoll-congress-candidate-ajit-mangaraj-dies-of-corona/articleshow/82082714.cms

No comments