Breaking News

ఫలితాల కోసం చూడొద్దు.. కరోనా లక్షణాలుంటే చికిత్స చేయండి: కేంద్రం గైడ్‌లైన్స్


కరోనా లక్షణాలు బయటపడిన తర్వాత.. నిర్దారణ పరీక్షలు చేయించుకుని ఫలితాలు వచ్చేవరకూ నిరీక్షించడంతో చికిత్స అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో పాజిటివ్‌ అని నిర్ధారణ అయితేనే చికిత్సకు చేర్చుకుంటామని ఆస్పత్రులు అంటున్నాయి. ఈ జాప్యం వల్ల జరుగుతున్న ప్రాణనష్టం నివారించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. కొవిడ్‌ చికిత్సలో రాష్ట్రాలు, ఆసుపత్రులకు స్పష్టమైన కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం రాత్రి మార్గదర్శకాలను జారీచేసింది. జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం తదితర కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్ధారణ పరీక్షల ఫలితం కోసం వేచిచూడకుండా సత్వరమే చికిత్సను ప్రారంభించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశించింది. లక్షణాలు బయటపడిన దగ్గర నుంచి కొవిడ్‌ నిర్ధారణ ఫలితం వచ్చే వరకూ కనీసం మూడు నాలుగు రోజుల సమయం పడుతోందని, ఈ జాప్యాన్ని నివారించేందుకు కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి. స్వల్ప లక్షణాలున్న బాధితులకు, ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చినా లక్షణాలు కనిపిస్తున్నవారికి అందజేయాల్సిన చికిత్సలపై ఆరోగ్య శాఖలోని కొందరు వైద్యనిపుణులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐసీఎంఆర్‌, ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్లు డాక్టర్‌ బలరాం భార్గవ, డాక్టర్‌ రణదీప్‌ గులేరియా తదితరులతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. కొవిడ్‌ చికిత్సల్లో జాప్యాన్ని నివారించి త్వరితగతిన బాధితులకు వైద్యసేవలు ప్రారంభించడంపై ప్రధానంగా చర్చించారు. కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తున్నా.. అది కరోనా కాకపోచ్చనే భావనతో చాలా మంది ఎటువంటి చికిత్స తీసుకోవడంలేదు. మరికొందరు కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకుని ఫలితం వచ్చే వరకూ వేచి చూస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో బాధితుల ఆరోగ్యం హఠాత్తుగా క్షీణిస్తోంది. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరినప్పుడు చికిత్స కష్టమై కొన్నిసార్లు పరిస్థితి దిగజారుతోంది. దీన్ని నివారించడానికి బుధవారం సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొవిడ్‌ లక్షణాలు బయటపడితే నిర్ధారణ పరీక్షల ఫలితాల కోసం వేచి చూడకుండా వెంటనే చికిత్సను ప్రారంభించాలి. హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలి. వారి పరిస్థితి విషమిస్తున్నట్లుగా గుర్తించినా వెంటనే ఆసుపత్రికి తరలించాలి. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చినా.. బాధితుల్లో లక్షణాలు కనిపిస్తుంటే.. దాన్ని కొవిడ్‌గానే భావించి చికిత్స అందజేయాలి. ఇంటి దగ్గర చికిత్స పొందుతున్న బాధితులకు ఔషధాలు అందిస్తున్నా కూడా జ్వరం తగ్గకుండా శ్వాస తీసుకోవడం కష్టమవుతున్నట్లుగా గుర్తిస్తే.. వారికి కూడా సత్వరమే స్టెరాయిడ్‌ చికిత్సను ప్రారంభించాలి. దేశవ్యాప్తంగా చికిత్సలో అవసరమైన మార్పులు చేసుకోవాలని సూచించారు.


By April 29, 2021 at 08:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/union-ministry-of-health-issues-latest-guidelines-for-covid-treatment/articleshow/82302266.cms

No comments