Breaking News

మీరు ప్రధాని అయితే ఏం చేస్తారు? అమెరికా రాయబారి ప్రశ్నకు రాహుల్ సమాధానం ఇదీ


అమెరికా రాయబారి నికోలస్ బర్న్స్‌తో జరిగిన వర్చువల్ సమావేశంలో కాంగ్రెస్ నేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను ప్రధాని అయితే ఏం చేస్తాననే విషయం సహా పలు అంశాలపై రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు ప్రధాని అయితే ఎటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తారనే ప్రశ్నకు రాహుల్ బదులిస్తూ.. వృద్ధి ఆధారిత విధానాలకు బదులు ఉద్యోగాల సృష్టిపైనే దృష్టిసారిస్తానని అన్నారు. ‘‘నేను వృద్ధి-కేంద్రీకృత విధానం నుంచి ఉద్యోగ-కేంద్రీకృత విధానం దిశగా ఆలోచిస్తాను.. అభివృద్ధి కావాలి కానీ, ఉత్పత్తి, ఉద్యోగాల కల్పన, అదనపు విలువ అన్నింటి కంటే ముఖ్యం’’ అని అన్నారు. ‘ప్రస్తుతం మన వృద్ధిని పరిశీలిస్తే.. మన వృద్ధికి, ఉద్యోగ కల్పనకి మధ్య, అదనపు విలువ, ఉత్పత్తి మధ్య ఉండే సంబంధం లేదు. అదనపు విలువలో చైనా అగ్రస్థానంలో ఉంది.. ఉద్యోగ కల్పన సమస్య గురించి నాతో చెప్పిన చైనా నేతను నేను ఎప్పుడూ కలవలేదు’ అని రాహుల్ స్పష్టం చేశారు. ఒకవేళ ఉద్యోగ కల్పన లేకపోతే 9 శాతం ఆర్థిక వృద్ధిపై నాకు ఆసక్తి లేదని అన్నారు. ఈ సందర్భంగా భారత్‌లో జరుగుతున్న పరిణామాలపై అమెరికా ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘భారత్‌లో జరుగుతున్న పరిణామాలపై అమెరికా ఎందుకు స్పందించడం లేదు. స్పందించినట్లు నేనెక్కడా వినలేదు. ఇరు దేశాల మధ్య ఉన్నది ప్రజాస్వామిక భాగస్వామ్యం అని మీరు ప్రకటించారు. భారత్‌లో జరుగుతున్న పరిణామాలపై మీ అభిప్రాయం ఏమిటి? అమెరికా లోతుగా పరిణామాలను విశ్లేషిస్తుందని నేను బలంగా నమ్ముతా. స్వేచ్ఛకు మీ రాజ్యాంగంలో అధిక ప్రాధాన్యమిచ్చారని నమ్ముతా. అలా పొందుపరచడం చాలా శక్తిమంతమైన ఆలోచనే. కానీ... ఆ శక్తిని కాపాడాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది.’’ అని రాహుల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నింటినీ బీజేపీ తన గుప్పిట్టో పెట్టుకుందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థికంగా బాగా పుంజుకుందని, మీడియాను కూడా శాసిస్తోందని, అందుకే విపక్ష పార్టీలు ఎన్నికల్లో ఓడిపోతున్నాయని పేర్కొన్నారు. కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదని, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ లాంటి పార్టీలూ కూడా ఓటమిపాలవుతున్నాయని అన్నారు. రాజకీయ పార్టీలూ ఎన్నికల్లో పోటీ చేయడానికి సంస్థాగతంగా ఓ చట్రం అవసరమని, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగబద్ధ సంస్థలు ఎంతో అవసరమని రాహుల్ వ్యాఖ్యానించారు. కానీ దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, రాజ్యాంగబద్ధమైన సంస్థలపై బీజేపీ తీవ్రమైన ఆధిపత్యాన్ని చెలాయిస్తోందని రాహుల్ దుయ్యబట్టారు. ఈ సమయంలో అసోంలో ఈవీఎంను బీజేపీ నేత వాహనంలో తరలించిన విషయాన్ని రాహుల్ ప్రస్తావించారు. దేశంలో అనేక తీవ్రమైన సమస్యలు ఉన్నాయి.. కానీ, జాతీయ మీడియాలో వాటి ఊసేలేదన్నారు.


By April 03, 2021 at 03:20PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/what-would-you-do-as-prime-minister-rahul-gandhi-interesting-reply/articleshow/81886030.cms

No comments