Breaking News

కరోనా వ్యాప్తి తీవ్రం.. ఛార్ దామ్ యాత్రపై ఉత్తరాఖండ్ కీలక నిర్ణయం


కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది ఛార్ ధామ్ యాత్రను ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దుచేసింది. మే 14 నుంచి యాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నా.. కరోనా విజృంభించడంతోనే చార్‌ధామ్ యాత్రను రద్దుచేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ గురువారం వెల్లడించారు. నాలుగు ఆలయాల్లో పూజారులు మాత్రమే పూజాధికాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. హిమాలయాల్లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రిలను ఛార్‌ దామ్ యాత్రగా పిలుస్తారు. కరోనా కట్టడి లాక్‌డౌన్ కారణంగా గతేడాది ఈ యాత్ర రద్దయ్యింది. ‘‘రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఛార్ ధామ్ యాత్రను ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దుచేసింది... నాలుగు ఆలయాల్లో పూజలు, క్రతువులు కేవలం పూజారులు మాత్రమే నిర్వహిస్తారు’’ అని సీఎం రావత్ తెలిపారు. కరోనా వ్యాప్తి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఛార్ ధామ్‌ పుణ్యక్షేత్రాలలో కేదార్‌నాథ్‌ ఆలయాన్ని మే 17న ఉదయం 5 గంటలకు తెరవనున్నారు. అలాగే బద్రీనాథ్‌ ఆలయాన్ని మే 18న.. గంగోత్రి, యమునోత్రి ఆలయాలను మే 14న తెరవనున్నట్లు ఛార్ ధామ్ బోర్డు ప్రకటించింది. ఏడాదిలో ఆరు నెలల పాటు ఈ నాలుగు ఆలయాలను మంచు కారణంగా మూసివేసి, ఏప్రిల్‌, మే నెలల్లో తిరిగి తెరుస్తుంటారు. ద్వాదశ జ్యోతిర్లాంగాలలో ఒకటైన కేదారీనాథ్ సముద్ర మట్టానికి 3,583 అడుగులో ఎత్తులో మందాకినీ నది పక్కన ఉంది. ప్రపంచంలోని శివుడి ప్రత్యేకమైన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. 2013లో సంభవించిన భారీ వరదలకు ఈ ఆలయం చెక్కుచెదరలేదు. మందాకినీ నది ఉగ్రరూపం దాల్చి విలయతాండవం చేసింది. కరోనా కారణంగా హరిద్వార్ కుంభమేళాను నెల రోజులు మాత్రమే నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లో బుధవారం రికార్డుస్థాయిలో 6,054 కేసులు, 108 మరణాలు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్ సహా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి కుంభమేళా పరోక్షంగా కారణమయ్యిందనే విమర్శలు వెల్లువెత్తాయి. కుంభమేళాకు వెళ్లొచ్చినవారు కరోనా ప్రసాదం పంచుతున్నారని ముంబయి మేయర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.


By April 29, 2021 at 02:57PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/uttarakhand-govt-suspends-char-dham-yatra-amid-covid-cases-rise-in-state/articleshow/82307848.cms

No comments