Breaking News

మరోసారి హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఆర్‌జీవీ.. ఈసారి మామూలుగా ప్లాన్ చేయలేదు


ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే సూపర్‌హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ‘శివ’, ‘సర్కార్‌’, ‘సత్య’ వంటి సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన ఆర్‌జీవి.. ‘భూత్’, ‘కౌన్’, ‘ఫూంక్’ తదితర చిత్రాలతో ప్రేక్షకులను అదేస్థాయిలో భయపెట్టాడు. అయితే గతకొంత కాలంగా ఆయన తన విధానాన్ని మార్చుకున్నాడు. తన సినిమాల్లో కథ కంటే కాంట్రవర్సీకే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ అంటే మొదటి నుంచి కాంట్రవర్షియల్ డైరెక్టర్ అనే పేరు ఉంది. కానీ, అది ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోయింది. ముఖ్యంగా పోర్న్‌స్టార్ మియా మాల్కోవాతో ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ అనే డాక్యుమెంటరీని రూపొందించి.. ఆయన సరికొత్త కాంట్రవర్సీకి తెరలేపాడు. ఇక కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ కాలంలోనూ ‘క్లైమాక్స్’, ‘నేక్‌డ్’, ‘నేక్‌డ్-2’ వంటి సినిమాలను విడుదల చేశాడు ఆర్‌జీవి. ఈ సినిమాల విషయంలోనూ సోషల్‌మీడియాలో జరగాల్సినంత చర్చ జరిగింది. ఎవరు ఎన్ని మాటలన్నా.. ఆర్‌జీవి మాత్రం తన ధోరణలో ఇంచు కూడా మార్చుకోలేదు. ‘నేను ఇలాగే ఉంటాను.. నేను నాలాగే ఉంటాను’ అనే స్టైల్‌లో దూసుకుపోతున్నాడు వర్మ. ఇది నాణేనికి ఒకవైపైతే.. మరోవైపు ఆర్‌జీవీ మంచి సక్సెస్‌ను అందుకొని చాలాకాలమైంది. ‘రక్త చరిత్ర’ సినిమా తర్వాత ఆయన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. ఈ నేపథ్యంలో మరోసారి తనకు ఎంతో కలిసొచ్చిన హారర్ జోనర్‌లో సినిమాను తెరకెక్కించాడు వర్మ. ఈ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ‘ఆర్‌జీవి దయ్యం’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో యాంగ్రీస్టార్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించాడు. స్వాతి దీక్షిత్, తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ తదితరులు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ఈ నెల 16వ తేదీన ఐదు భాషల్లో(తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ) విడుదల చేస్తున్నట్లు వర్మ ప్రకటించారు. చాలాకాలం తర్వాత వర్మ దర్శకత్వంలో వస్తున్న హారర్ సినిమా కావడంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు హీరో రాజశేఖర్‌తో పాటు ఇతర తారాగణం కూడా బలంగా ఉంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఆర్‌జీవి మాట్లాడుతూ.. ఈ సినిమాని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. స్వాతి దీక్షిత్ ఈ సినిమాలో రాజశేఖర్ కూతురి పాత్రలో నటించిందని.. ఈ పాత్ర కోసం రాజశేఖర్ మేకప్ లేకుండా నేచురల్‌గా నటించారని పేర్కొన్నారు. ఈ చిత్రం ప్రతీ ఒక్కరికి నచ్చుతుందని.. ప్రేక్షకులు అందరూ ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తారని ధీమా వ్యక్తం చేశారు.


By April 06, 2021 at 02:03PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-gopal-varma-new-movie-rgv-deyyam-movie-to-be-released-five-languages/articleshow/81929398.cms

No comments