Breaking News

టెక్సాస్‌లో కాల్పులు: ఒకరు మృతి, పలువురి పరిస్థితి విషమం.. బైడెన్ ఆ నిర్ణయం తీసుకున్న కాసేపటికే


అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. టెక్సాస్‌లో ఓ ఆగంతుకుడు తుపాకితో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు టెక్సాస్‌లోని బ్రయన్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తుపాకుల సంస్కృతికి కళ్లెం వేసే దిశగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చర్యలు చేపట్టిన కాసేపటికే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఓ అధికారికి గాయాలైనట్టు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ కాల్పులు ఘటన జరిగినట్టు బ్రయన్ పోలీస్ చీఫ్ ఎరిక్ బుస్కే పేర్కొన్నారు. క్యాబినెట్రీ మ్యానుఫ్యాక్చరర్ వద్ద జరిగిన ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఎరిక్ బుస్కే వివరించారు. దుండగుడు జరిపిన కాల్పుల్లో మొత్తం ఏడుగురు గాయపడినట్టు పోలీసులు ధ్రువీకరించారు. వీరిలో ఒకరికి స్వల్ప గాయాలైనట్టు తెలిపారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరపడంతో అతడికి కూడా గాయాలైనట్టు టెక్సాస్ ప్రజాభద్రతా విభాగం వెల్లడించింది. అతడి పరిస్థితి విషమంగా ఉన్నా.. ప్రస్తుతం నిలకడగా ఉందని పేర్కొంది. ‘మీరు ఊహించడానికి చాలా క్లిష్టంగా ఉంది ఎందుకంటే మీకు గొడౌన్‌లో మొత్తం కార్మికులు ఉన్నారు.. కాబట్టి మేము అన్నింటినీ క్రమబద్ధీకరిస్తున్నాం.. సాక్షులను ఇంటర్వ్యూ చేస్తున్నాం.. ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ప్రజలతో మాట్లాడుతున్నాం’ అని ఎరిక్ వ్యాఖ్యానించారు. ఇటీవల కొలరాడో, జార్జియో, కాలిఫోర్నియాలో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అమెరికాలో కాల్పులు, ఆత్మహత్యల వల్ల ఏటా 40వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా, తుపాకుల సంస్కృతికి కళ్లెం వేసే దిశగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన ఆరు కీలక చర్యలను ప్రతిపాదించారు. మద్యం, పొగాకు, ఆయుధాలు, పేలుడు పదార్థాల నిరోధక సంస్థ(ఏటీఎఫ్‌) డైరెక్టర్‌గా డేవిడ్‌ చిప్‌మాన్‌ను నియమించారు. మాజీ ఫెడరల్‌ ఏజెంట్‌ అయిన డేవిడ్‌ ప్రస్తుతం తుపాకుల నియంత్రణ సంస్థ గిఫార్డ్స్‌ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఏటీఎఫ్‌ ఏజెంట్‌గా ఆయన 25 ఏళ్లు పనిచేశారు. అయితే, అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనను రిపబ్లికన్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తున్నారు.


By April 09, 2021 at 08:29AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/one-killed-several-critical-in-texas-shooting-in-us/articleshow/81980335.cms

No comments