Breaking News

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పుట్టినరోజు వేడుకలు.. ప్రధానికి భారీ జరిమానా!


కోవిడ్-19 కట్టడికి నిబంధనలు విధించి, ప్రజలందరూ కచ్చితంగా పాటించాలని, లేకపోతే జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని పిలుపునిచ్చిన ఓ ప్రధానే వాటిని ఉల్లంఘించారు. దీంతో ప్రధానికి పోలీసులు భారీ జరిమానా విధించారు. ఈ ఘటన నార్వేలో చోటుచేసుకుంది. ఎర్నా సోల్‌బెర్గ్‌ తన పుట్టినరోజు నాడు కరోనా నిబంధనలను ఉల్లంఘించి వేడుకలు నిర్వహించారు. నార్వేలో అమలవుతోన్న కొవిడ్‌ నిబంధనల ప్రకారం ఏదైనా వేడుకలకు 10మంది కంటే ఎక్కువ మంది హాజరుకాకూడదు. ప్రధాని ఎర్నా ఫిబ్రవరిలో తన 60వ పుట్టినరోజు సందర్భంగా ఓ రిసార్ట్‌లో వేడుకలను నిర్వహించి 13 మంది కుటుంబసభ్యులను ఆహ్వానించారు. ఈ విషయం బయటకు రావడంతో ఆమెకు 20 వేల నార్వేజియన్‌ క్రోన్‌ల (సుమారు 1.75 లక్షలు) జరిమానా విధించారు. ప్రజల్లో కొవిడ్‌ నిబంధనల అమలుపై నమ్మకం పెంచడానికే ప్రధానికి జరిమానా విధించామని, ఇది సరైన చర్యేనని నార్వే పోలీస్‌ చీఫ్‌ ఒలే సవేర్డ్ తెలిపారు. కాగా, ఈ ఘటనపై ప్రధాని ఎర్నా సోల్‌బెర్గ్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. సాధారణ ప్రజానీకం కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినా చూసీచూడనట్టు వ్యవహరించిన పోలీసులు.. సాక్షాత్తు ప్రధానే అలా చేయడంతో ప్రజలకు నమ్మకం పోతుందనే ఉద్దేశంతోనే జరిమానా విధించామని ఒలే వ్యాఖ్యానించారు. చట్టం అందరికీ వర్తిస్తుందని, దాని ముందు అందరూ సమానమేనని అన్నారు. ప్రధానికి జరిమానా విధించడంతో సాధారణ ప్రజానీకంలో నమ్మకం కలిగి, నిబంధనలను కచ్చితంగా పాటిస్తారని పేర్కొన్నారు. ప్రధాని పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న రిసార్ట్‌కు మాత్రం జరిమానా విధించలేదని తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రధాని కార్యాలయం ఇంకా స్పందించలేదు. వచ్చే సెప్టెంబరులో నార్వే పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనుండగా.. ఐరోపాలో కరోనా వైరస్‌ను కట్టడిచేసి దేశాల్లో ఒకటిగా నార్వే నిలిచింది. తక్కువ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. అయితే, ఇటీవల కాలంలో కోవిడ్ కేసులు ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్త వేరియంట్‌లు విజృంభించడంతో మహమ్మారి కట్టడికి మరోసారి కఠిన ఆంక్షలు కొనసాగిస్తున్నారు.


By April 10, 2021 at 07:02AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/prime-minister-was-fined-by-police-over-covid-rules-violation-in-norway/articleshow/81998639.cms

No comments