Breaking News

ఇది నా జీవితంలో అత్యంత సంతోషకర క్షణం.. మావోల చెర నుంచి విడుదలైన జవాన్ భార్య


నాలుగు రోజుల నరాలు తెగే ఉత్కంఠకు తెరదించుతూ.. తమ చెరలో ఉన్న మన్‌హాస్‌ను గురువారం సాయంత్రం ప్రజా కోర్టులో మావోయిస్టులు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో జవాన్ కుటుంబసభ్యుల్లో సంతోషం వెల్లివెరిసింది. తన భర్త క్షేమంగా తిరిగి రావడంతో రాకేశ్వర్ సింగ్ భార్య ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రిని మావోయిస్టులు విడుదల చేసిన తర్వాత మొబైల్ ఫోన్‌లో ఫోటో చూసి ఆయన అయిదేళ్ల కుమార్తె ముద్దు పెట్టుకుంది. రాకేశ్వర్ సింగ్ భార్య మీను ఇది తన జీవితంలో అత్యంత సంతోషకర సమయమని పేర్కొంది. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది నా జీవితంలో అత్యద్భుత క్షణం.. ఆయన క్షేమంగా తిరిగొచ్చిన ఘటన ఎప్పుడూ గుర్తుండిపోతుంది.. అలాగే, ఆయన విడుదలకు ప్రయత్నించిన కేంద్రం, చత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి, అత్యంత క్లిష్టమైన సమయంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకుంటున్నాను’ అని ఆనంద బాష్పాలు కార్చారు. ‘‘దేవుడు చివరకు నా మొర ఆలకించాడు.. ఆయన విడుదలైన విషయం తనకు ఎంతో సంతోషం.. ఆయనను చూడాలని ఎంతో ఉత్సుకతతో ఉన్నాను.. ఆయనతో నేను మాట్లాడాను.. వైద్య పరీక్షల కోసం ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు.. ఆయనకు చికెన్ అంటే ఎంతో ఇష్టం.. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత వండిపెడతాను’’ అని ఉబ్చితబ్బుబ్బి అవుతున్నారు. కుమారుడి విడుదలపై రాకేశ్వర్ సింగ్ తల్లి కుంతీదేవి సంతోషం వ్యక్తం చేశారు. తన కుమారుడికి ఇది పునర్జన్మని కన్నీళ్లు పెట్టుకున్నారు ‘గత ఆరు రోజులు మా కుటుంబానికి ఎంతో భారంగా గడిచాయి.. మేం ఎంతో ఆందోళన చెందాం.. కానీ, ప్రస్తుతం నా కుమారుడు విడుదల కావడంతో చాలా సంతోషంగా ఉంది.. నా మనవరాలు ఎంతో ఆనందంగా ఉంది.. తండ్రి రాకకోసం ఎదురుచూస్తోంది.. రాకేశ్వర్ ఎప్పుడొస్తాడని మేమంతా ఎదురుచూస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. రాకేశ్వర్ సింగ్ విడుదలైన తర్వాత ఆయన కుటుంబసభ్యులు ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశారు. చుట్టుపక్కల వారికి ఆనందంతో మిఠాయిలు పంచిపెట్టారు. మావోయిస్టులు విడుదల చేసిన తర్వాత రాకేశ్వర్ సింగ్‌ను జర్నలిస్ట్‌లు తమ వాహనంపై తీసుకొచ్చారు. గతవారం ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకున్న మావోయిస్టుల దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జవాన్లను ట్రాప్ చేసి 400 మంది మావోయిస్టులు ఒక్కసారిగా భద్రతా దళాలపై విరుచుకుపడడంతో 24 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న కోబ్రా కమాండర్ రాకేష్ సింగ్‌ను మావోయిస్టులు తమ చెరలో బంధీగా ఉంచుకున్నారు. తన తండ్రి నక్సల్స్ చెరలో బంధీగా ఉన్నాడని తెలిసి ఆయన కుమార్తె ఏడుస్తూ మా నాన్నని వదిలేయండి అంటూ విజ్ఞప్తి చేసింది. మా నాన్నను వదిలిపెట్టండి.. అంకుల్ ప్లీజ్.. అంటూ చిన్నారి చేసిన ప్రార్ధన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. తమ వద్ద బందీగా ఉన్న సీఆర్‌పీఎఫ్ కోబ్రా కమాండర్ రాకేశ్వర్ సింగ్‌పై ప్రకటన చేసిన మావోయిస్టులు.. ఆయనను వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లు ప్రకటిస్తే బందీని అప్పగిస్తామని వెల్లడించారు. అప్పటివరకు రాకేశ్వర్ సింగ్ తమ వద్దే క్షేమంగా ఉంటాడని పేర్కొన్నారు. రాకేశ్వర్ సింగ్ విడుదల కోసం 11 మంది సభ్యలు బృందం మావోయిస్టులతో చర్చలు జరిపింది. ఇందులో ఏడుగురు జర్నలిస్టులు కూడా ఉన్నారు. సుకుమా రేంజ్‌లోని తెర్రం సమీపంలో గ్రామస్తుల సమక్షంలో రాకేశ్వర్ సింగ్‌ కట్లు విప్పి మావోయిస్టులు అప్పగించారు.


By April 09, 2021 at 10:36AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/happiest-moment-of-my-life-says-wife-of-soldier-rakeshwar-singh/articleshow/81981930.cms

No comments