Breaking News

దేశంలో కరోనా మహోగ్రరూపం.. రోజువారీ కేసుల్లో అమెరికాను దాటేసి ప్రపంచ రికార్డు!


దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. రికార్డుస్థాయిలో కొత్త కేసులు, కోవిడ్ మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా, రోజువారీ కేసుల్లో భారత్ ప్రపంచ రికార్డు సాధించింది. ఇప్పటి వరకూ రోజువారీ కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా ఆ రికార్డును భారత్ అధిగమించింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 3.16 లక్షల కేసులు నిర్ధారణ అయ్యాయి. అమెరికాలో జనవరి 8న అత్యధికంగా 307,581 కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆ రికార్డు కనుమరుగయ్యింది. గడచిన 24 గంటల్లో దేశంలో 315,925 కేసులు నమోదు కాగా 2,102 మంది కోవిడ్‌కు బలయ్యారు. ఇప్పటి వరకూ దేశంలో కోవిడ్ మొదలైన తర్వాత నమోదయిన అత్యధిక మరణాలు ఇవే కావడం గమనార్హం. కేవలం 17 రోజుల్లో రోజువారీ కేసులు లక్ష నుంచి మూడు లక్షలకు చేరడం మహహ్మారి తీవ్రతకు అద్దం పడుతోంది. అంటే రోజువారీ కేసులు 6.76 శాతం మేర పెరుగుతుండగా.. వైరస్ వ్యాప్తి వేగం అమెరికాతో పోల్చితే నాలుగు రెట్లు అధికం. భారత్ తర్వాత అమెరికాలోనే రోజువారీ కేసులు లక్ష దాటి నమోదయ్యాయి. అయితే, జనాభా పరంగా చూస్తే కోవిడ్ కేసులు, మరణాలు అమెరికాలోనే అధికం. అక్కడ ప్రతి పది లక్షల మందిలో 97,881 మంది సగటున కోవిడ్ బారినపడగా.. 1,752 మంది బలయ్యారు. ఇదే భారత్‌ విషయానికి వస్తే ప్రతి మిలియన్‌కు సగటున 11,418 మందికి వైరస్ సోకింది.. 132 మరణాలు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా కంటే కేసుల్లో 9 రెట్లు, మరణాల్లో 13 రెట్లు తక్కువ కావడం కాస్త ఊరట కలిగించే అంశం. అయితే, ప్రస్తుతం వైరస్ ఉద్ధృతితో చాలా రాష్ట్రాల్లో ఆరోగ్య మౌలిక వసతులు కుప్పకూలే స్థితికి చేరుకున్నాయి. గత మూడు రోజులుగా పాజిటివిటీ జాతీయ సగటు 19.2 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలోని మొత్తం 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రోజువారీ కేసులు రికార్డుస్థాయితో నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా కేసులు నమోదయిన రాష్ట్రాల్లో యూపీ (33,214), కర్ణాటక (23,558), కేరళ (22,414), రాజస్థాన్ (14,622), మధ్యప్రదేశ్ (13,107), గుజరాత్ (12,553), బిహార్ (12,222), తమిళనాడు (11,681), బెంగాల్ (10,784), హరియాణా (9,623), ఝార్ఖండ్ (5,041), పంజాబ్ (4,970), ఉత్తరాఖండ్ (4,807), ఒడిశా (4,851), తెలంగా్ (6,542), జమ్మూ కశ్మీర్ (2,204), గోవా (1,502)లు నిలిచాయి. మహారాష్ట్రలో మరో 67,468 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ముందు రోజుతో పోల్చితే ఢిల్లీలో కేసులు భారీగా తగ్గాయి. బుధవారం 24,638 కేసులు బయటపడ్డాయి. ఇక, మొదటి దశ కంటే రెండో దశలో తక్కువ కేసులు నమోదయిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఉంది. ఆగస్టు 26న ఏపీలో అత్యధికంగా 10,830 కేసులు బయటపడ్డాయి. బుధవారం9,716 కొత్త కేసులు నిర్ధారణ కాగా.. ఏకంగా 35 మంది ప్రాణాలు కోల్పోయారు.


By April 22, 2021 at 07:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/over-3-16-lakh-new-covid-19-cases-in-india-highest-ever-for-any-country/articleshow/82190262.cms

No comments