Breaking News

అందాల పోటీల్లో విజేతకు షాక్.. అలంకరించిన కిరీటాన్ని బలవంతంగా లాగేశారు!


అందాల పోటీల్లో ఓ మహిళను విజేతగా ప్రకటించన న్యాయనిర్ణేతలు, ఆమెకు కిరీటం కూడా అలంకరించారు. కానీ, అక్కడివారిని షాక్‌కు గురిచేస్తూ ఆమె తలపై నుంచి కిరీటాన్ని బలవంతంగా లాగేసుకున్నారు. ఈ ఘటన ‘మిసెస్‌ శ్రీలంక’ అందాల పోటీల్లో చోటుచేసుకుంది. ఆదివారం జరిగిన ‘ 2020’తుది పోటీల్లో పుష్పిక డిసిల్వను న్యాయనిర్ణేతలు విజేతగా ప్రకటించారు. మిసెస్ వరల్డ్ కరోలిన్ జూరై.. డిసిల్వకు కిరీటాన్ని అలంకరించారు. తన విజయానికి గుర్తుగా ఆమె వేదికపై నడుస్తూ పక్కనే రన్నరప్‌లు, మిగతా వీక్షకులు ఆమెవైపు అభినందనగా చూస్తున్నారు. ఇంతవరకు అంతా సజావుగానే నడిచింది. అసలు కథ అక్కడే మొదలయ్యింది. మిసెస్‌‌ వరల్డ్‌‌, 2019 మిసెస్‌ శ్రీలంక వ్యవహరించిన తీరుతో పోటీలు రసాభాసగా మారాయి. జ్యూరీ వేదికపై మిసెస్ వరల్డ్‌గా ఉన్న కరోలిన్‌ మాట్లాడుతూ.. పోటీల నిబంధనల ప్రకారం విడాకులు తీసుకున్న మహిళకు కిరీటాన్ని స్వీకరించే అర్హత లేదని వ్యాఖ్యానించారు. ‘పోటీలో పాల్గొన్న మహిళలు వివాహం చేసుకుని, విడాకులు తీసుకోకూడదనే నిబంధన ఉంది. అందువల్ల ఈ కిరీటం మొదటి రన్నరప్‌కు దక్కుతుంది’ అంటూ పుష్పిక తలపై ఉన్న కిరీటాన్ని బలవంతంగా తీసి, మొదటి రన్నరప్‌ తలపై ఉంచారు. ఆ కిరీటాన్ని బలవంతంగా తీసే క్రమంలో మిసెస్ శ్రీలంకకు గాయాలు కూడా అయ్యాయి. కానీ అవేవి పట్టించుకోకుండా తనపని తాను చేసుకుపోవడతో ఈ హఠాత్పరిణామానికి అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. తీవ్ర నిరాశతో పుష్పిక వేదిక వెనకవైపు నుంచి వెళ్లిపోయారు. ఈ వ్యవహారమంతా మీడియాలో ప్రసారం కావడంతో మిసెస్ వరల్డ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేదికపై జరిగిన పరాభవానికి ఆగ్రహించిన పుష్పిక సోమవారం ఫేస్‌బుక్‌ ద్వారా తన ఆవేదన వెళ్లగక్కారు. ‘నేను విడాకులు తీసుకోలేదు. ఒకవేళ అదే జరిగుంటే ఆ పత్రాలు సమర్పించాలని వారికి సవాలు విసురుతున్నాను.. ఒకవేళ నేను అర్హురాలిని కాకుంటే పోటీల ప్రారంభంలోనే తొలగించాల్సింది.. నాకు జరిగిన అవమానానికి, అన్యాయానికి ఇప్పటికే చట్టపరంగా ముందుకెళ్లాను’ అంటూ తెలిపారు . అలాగే ‘నిజమైన రాణి అంటే ఇతరుల కిరీటాన్ని దోచుకెళ్లే మహిళ కాదు’ అంటూ మండిపడ్డారు. అయితే, ఈ ఘటనపై అందాల పోటీల నిర్వాహకులు స్పందించారు. పుష్పిక విడాకులు తీసుకోలేదని తెలియడంతో కిరీటాన్ని మళ్లీ ఆమెకు అందజేశారు. అనంతరం పుష్పిక డిసిల్వా మాట్లాడుతూ.. ‘ఈ దేశంలోని ఒంటరి తల్లులందరికీ ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను’ అని ప్రకటించారు. అటు, ఈ ఘటనపై మిసెస్ శ్రీలంక వరల్డ్ డైరెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కరోలినా వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉంది.. మిసెస్ వరల్డ్ సంస్థ ఇప్పటికే ఆమెపై దర్యాప్తు ప్రారంభించింది’ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై మిసెస్ వరల్డ్ కరోలినా తక్షణమే స్పందించలేదు. అయితే, ఆమె అధికారిక ఇన్‌స్టాలో మాత్రం డిసిల్వా విజయాన్ని ధ్రువీకరిస్తూ ఓ ఫోటోను షేర్ చేశారు.


By April 08, 2021 at 10:51AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/fight-on-stage-crown-snatched-at-mrs-sri-lanka-beauty-pageant/articleshow/81963686.cms

No comments