Breaking News

జార్జ్ ఫ్లాయిడ్ కేసులో సంచలన తీర్పు.. బైడెన్ సహా అమెరికన్లలో హర్షాతిరేకాలు


గతేడాది మేలో పోలీసుల క్రూరత్వానికి బలైపోయిన ఆఫ్రికన్‌-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ కేసులో న్యాయస్థానం తీర్పు వెలువరించింది. జార్జ్ ఫ్లాయిడ్ కస్టోడియల్‌ మృతి కేసులో మినియాపొలిస్‌ మాజీ పోలీసు అధికారి డెరెక్‌ చౌవిన్‌ (45)ను కోర్టు దోషిగా తేల్చింది. అత్యంత కర్కశత్వం ప్రదర్శించిన డెరెక్.. ఫ్లాయిడ్‌ మెడపై గట్టిగా మోకాలితో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేయడంతో ఆయన చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసులో 12 మంది జ్యూరీ సభ్యులు.. 45 మంది సాక్షులను విచారించి డెరెక్‌ను మూడు కేసుల్లోనూ దోషిగా నిర్ధారించారు. సాక్షుల్లో ఘటనా స్థలిలో ఉన్న పాదచారులు, పోలీస్ అధికారులు, వైద్య నిపుణులు ఉన్నారు. ఈ ఘటనలో వీడియోను కీలక ఆధారంగా తీసుకున్నారు. దోషిగా నిర్దారణ కావడంతో ఎనిమిది వారాల్లో శిక్ష ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తి పీటర్‌ కాహిల్‌ తెలిపారు. ఈ కేసుల్లో చౌవిన్‌కు 40 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉన్నట్లు అమెరికా మీడియా తెలిపింది. అయితే, తాను ఎటువంటి నేరానికి పాల్పడలేదని చౌవిన్‌ కోర్టులో వాదించారు. ఇదిలా ఉండగా, ఈ తీర్పుపై అమెరికాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జాత్యాహంకారానికి వ్యతిరేకంగా ఈ తీర్పు ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ప్రభావం చూపుతుందని ఫ్లాయిడ్‌ కుటుంబ సభ్యులు, ఆయన తరఫు న్యాయవాది ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘అమెరికాలోని నల్లజాతీయులకు న్యాయం జరగడం అంటే అమెరికన్లు అందరికీ న్యాయం జరిగినట్లే. అమెరికా చరిత్రలో ఈ కేసు ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. చట్టం బాధ్యత, అమలుకు సంబంధించి స్పష్టమైన సందేశాన్ని పంపుతోంది’’ అని ప్రకటనలో తెలిపారు. ఈ తీర్పుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లు స్పందించారు. ‘‘జాత్యహంకారం అమెరికా ఆత్మకు ఓ కళంకం.. అమెరికా నల్లజాతీయులను బాధించే గాయం.. ఈ బాధను వారంతా ప్రతిరోజూ అనుభవిస్తున్నారు. తాజా తీర్పు న్యాయాన్ని ఇచ్చింది. ఇక్కడితో మనం ఆగిపోకూడదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కృషి చేయాలి. నేటి తీర్పు అమెరికా న్యాయవ్యవస్థలో గొప్ప ముందడుగు’’ అని బైడెన్‌ అన్నారు. ‘‘ఈ తీర్పు మనల్ని ఒకడుగు దగ్గర చేసింది. మనం చేయాల్సింది ఇంకా ఉంది’’ అని హారిస్‌ వ్యాఖ్యానించారు. గతేడాది మే 25న జార్జ్ ఫ్లాయిడ్ ఓ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో సిగిరెట్లు కొనుగోలుచేసి, నకిలీ కరెన్సీ చెల్లించాడనే ఆరోపణలతో పోలీస్ అధికారి డేరక్ అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఫ్లాయిడ్ మెడపై కాలితో తొక్కిపెట్టి ఊపిరాడకుండా చేశాడు. బాధితుడు వదిలిపెట్టాలని కాళ్లావేళ్లా పడినా కనీసం కనికరించలేదు. అతడిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో అమెరికాలో ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తి పలుచోట్ల హింసకు దారితీసింది.


By April 22, 2021 at 09:23AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/ex-policeman-derek-chauvin-convicted-of-murder-in-george-floyd-case/articleshow/82191451.cms

No comments