Breaking News

నాగ్‌పూర్: కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. నలుగురి మృతి,ఇద్దరి పరిస్థితి విషమం


మహారాష్ట్రలోని ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు సజీవదహనం కాగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి కోవిడ్ ఐసీయూ వార్డులో ఈ ప్రమాదం జరిగింది. మరికొందరికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. రెండో అంతస్తులో ఉన్న కోవిడ్ ఐసీయూ వార్డు ఏసీ యూనిట్‌లో తొలుత మంటలు చెలరేగి, తర్వాత వార్డు మొత్తం వ్యాపించాయి. అయితే, మంటలను రెండో అంతస్తుకే పరిమితం కావడంతో పెను ప్రమాదం తప్పిందని నాగ్‌పూర్ మున్సిపల్ కార్పోరేషన్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాజేంద్ర ఉచ్కే తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆస్పత్రిలోని 27 మంది రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించినట్లు స్థానిక పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రమాదం చోటుచేసుకున్న ఆస్పత్రిలో మొత్తం 30 పడకలు ఉండగా... ఐసీయూలో 15 పడకలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై ట్విట్టర్‌లో స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ.. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘నాగ్‌పూర్ ప్రమాద ఘటన విచారకరం.. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు అండగా ఉంటాం.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ. ‘నాగ్‌పూర్‌లోని ఆస్పత్రిలో అగ్నిప్రమాద ఘటన చాలా బాధాకరం.. వెంటనే నాగ్‌పూర్ కలెక్టర్‌తో మాట్లాడాను.. అవసరమైన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.' అని పేర్కొన్నారు. దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్న విషయం తెలిసిందే. కోవిడ్ కట్టడికి అక్కడ నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్‌డౌన్స్ కూడా అమలు చేస్తున్నారు. అయినప్పటికీ పరిస్థితి నియంత్రణలోకి రాకపోవడంతో సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇదిలా ఉండగా, ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా పలుచోట్ల కోవిడ్ ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాద ఘటనలు చోటుచేసుకుని, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ వంటి చోట్ల భారీ ప్రాణనష్టం జరిగింది.


By April 10, 2021 at 08:56AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/four-dead-and-two-critical-in-fire-at-covid-hospital-in-nagpur/articleshow/81999378.cms

No comments