Breaking News

సీఎం జగన్ వీడియో మార్ఫింగ్.. మాజీ మంత్రి దేవినేనిపై సీఐడీ కేసు


ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సంబంధించి ఫోర్జరీ వీడియోను ప్రసారం చేశారనే ఆరోపణలతో మాజీ మంత్రి, నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇటీవల తిరుపతి ఉప-ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియా సమావేశంలో ఫోర్జరీ చేసిన ఎలక్ట్రానిక్‌ డాక్యుమెంట్లను ప్రదర్శించినట్టు ఐపీసీలోని 464, 465, 468, 471, 505 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదయ్యింది. లీగల్ సెల్ ఫిర్యాదు ఆధారంగా దేవినేనిపై కేసు నమోదుచేసిన సీఐడీ.. దర్యాప్తు ప్రారంభించింది. ‘ఏప్రిల్ 7న తిరుపతిలో దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు.. తిరుపతి రావడానికి ఎవరు ఇష్టపడతారని జగన్‌ గతంలో వ్యాఖ్యానించినట్టు దానికి సంబంధించిన ఓ వీడియోను ప్రదర్శించారు.. అది ఫోర్జరీ వీడియో.. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజలను పక్కదారి పట్టించాలన్న దురుద్దేశంతో ఈ నకిలీ, మార్ఫింగ్‌ చేసిన వీడియో ప్రదర్శించినందుకు దేవినేనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’అని వైఎస్ఆర్సీపీ లీగల్‌ సెల్‌ కర్నూలు జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి ఫిర్యాదు చేశారు. వేర్వేరు సందర్భాల్లో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఈ వీడియోలో చేర్చారని చెప్పారు. తిరుపతిలో సౌకర్యాలను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలతో పోటీ పడేలా తీర్చిదిద్దాల్సి ఉందని జగన్ వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను కలిపి వీడియో చేశారని ఆరోపించారు. కర్నూలు సీఐడీ రీజినల్ ఆఫీసులో డీఎస్పీ రవికుమార్‌ను కలిసి శనివారం ఫిర్యాదుచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసినప్పటి వీడియోను దీనికి జత చేశారని అన్నారు.దీని ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్‌ వెల్లడించారు. దేవినేని మీడియాలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను సమర్పించినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా, ఓటమి భయంతోనే తొలిసారిగా సీఎం జగన్.. తిరుపతిలో రాజకీయ పర్యటనకు వస్తున్నారని దేవినేని ఆరోపించారు. ఉపఎన్నికలు, స్థానిక సంస్థలు ఏం జరిగినా సీఎం జగన్ ప్రచారానికి రానవసరం లేదన్న వైఎస్ఆర్సీపీ నేత నాయకులు... ఇప్పుడేం చెప్తారని ప్రశ్నించారు. తిరుపతిలో ఉండటానికి ఎవరూ ఇష్టపడరని గతంలో జగన్ వ్యాఖ్యలు చేశారని ఓ వీడియోను విడుదల చేశారు.


By April 11, 2021 at 09:01AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/kurnool/cid-case-booked-against-tdp-leader-devineni-umamaheswar-rao-for-fake-video/articleshow/82012786.cms

No comments