Breaking News

ఇజ్రాయేల్‌లో పెను విషాదం: పండుగ వేళ తొక్కిసలాట.. 44 మంది మృతి


ఇజ్రాయేల్‌లో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యూదుల పండుగ లాగ్ బౌమర్ సందర్భంగా వేలాది మంది ప్రార్థనలకు హాజరైన వేళ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 44 మంది మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. పవిత్ర స్థలం మౌంట్ మెరెన్ వద్ద ఈ ఘటన సంభవించింది. వేలాదిగా ప్రార్ధనలకు హాజరు కాగా.. మౌంట్ మెరెన్ పైకప్పు కూలడంతో తొక్కిసలాటకు దారితీసింది. లాగ్ బౌమర్ పండుగ రోజున క్రీ.శ. రెండో శతాబ్దం నాటి మత గురువు రబ్బీ షిమోన్ బార్ యోచాయ్ సమాధి వద్ద ప్రార్థనలకు యూదులు భారీగా తరలివస్తారు. ప్రపంచంలోని యూదుల పవిత్ర స్థలాల్లో ఇది ఒకటి. ఈ ఏడాది పర్వదినాన్ని పురస్కరించుకుని యూదులు వేలాదిగా వచ్చి ప్రార్థనలు నిర్వహిస్తుండగా అర్ధరాత్రి తర్వాత దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే, దీనికి గల కారణాలు తెలియరాలేదు. ఘటన గురించి యిట్జాక్ అనే ఓ యువకుడు పోలీసులు సమాచారం అందజేశాడు. ఈ ఘటనపై ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇదో భారీ విపత్తుగా ఆయన అభివర్ణించారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించి మౌంటర్ మెరెన్‌కు భారీ సంఖ్యలో చేరుకున్నారని అధికారులు తెలిపారు. ‘‘ముందు వరుసలో ఒక్కసారిగా బాంబు పేలిన శబ్దం వచ్చింది.. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు..ఆనందం శోకం అయ్యింది.. వెలుగు చీకటిగా మారింది.. తానూ మరణం అంచుల వరకూ వెళ్లొచ్చాను’’ అని ఆ యువకుడు తెలిపారు. ‘‘రబ్బీ షిమోన్ తాను ప్రపంచాన్ని పరిపూర్ణం చేయగలనని చెప్పేవాడు ... తన జన్మదినం జరిగిన రోజునే ఈ ఘటన చోటుచేసుకోవడంపై మనం నిజమైన ఆత్మ పరిశీలన చేసుకోవాలి’’ అని అన్నాడు. ఈ ఘటనలో 103 మంది గాయపడినట్టు మగేన్ డేవిడ్ ఆడమ్ అంబులెన్స్ సర్వీస్ తెలిపింది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొంది. సహాయక చర్యల్లో ప్రాణనష్టంపై అంచనావేయడానికి సిబ్బంది ప్రయత్నించగా పోలీసులు ఆ స్థలాన్ని మూసివేసి, వారిని బయటకు పంపారు. అంబులెన్సులకు ఆటంకం లేకుండా ఉండటానికి ఆ ప్రాంతంలో రహదారి పనులను నిలిపివేశారు. సైనిక హెలికాప్టర్లు ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.


By April 30, 2021 at 08:49AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/more-than-50-killed-in-stampede-at-israeli-religious-festival/articleshow/82320839.cms

No comments