Breaking News

చత్తీస్‌గఢ్: నక్సల్స్ దాడిలో 22 మంది జవాన్లు మృతి.. ఏడుగురి పరిస్థితి విషమం


ఛత్తీస్‌గఢ్‌లోని పోలీసులు, మావోయిస్టులకు మధ్య శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది జవాన్లు మృతి చెందినట్టు బీజాపూర్ ఎస్పీ వెల్లడించారు. నక్సల్స్ దాడిలో మరో 31 మంది గాయపడగా.. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బీజాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో గల్లంతైన జవాన్లు కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. గాయపడిన జవాన్లు ప్రస్తుతం బీజాపూర్, రాయపూర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఎస్పీ వివరించారు. గల్లైంతన వారి కోసం బీజాపూర్, సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. డీఆర్జీ పోలీసులు అమరులైనట్టు తెలిపారు. నక్సల్స్, భద్రతా బలగాలు మధ్య శనివారం సాయంత్రం ప్రారంభమైన కాల్పులు నాలుగు గంటలపాటు కొనసాగాయని పేర్కొన్నారు. అటు, నక్సల్స్‌కు భారీ నష్టం జరిగిందని, వారు కూడా పెద్ద సంఖ్యలో హతమయ్యారని వివరించారు. ఇప్పటి వరకూ ఓ మహిళా నక్సలైట్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. జవాన్లపై దాడి తర్వాత వారి వద్ద నుంచి నక్సల్స్ ఆయుధాలను ఎత్తుకెళ్లినట్టు సీఆర్పీఎఫ్ వర్గాలు తెలిపాయి. బీజాపూర్ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. అమర జవాన్ల త్యాగాలను వృథాకానీబోమని, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. అమరులకు నివాళులర్పించిన అమిత్‌షా.. ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బఘెల్‌కు ఫోన్‌ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. ఆ రాష్ట్రానికి వెళ్లి ఆపరేషన్‌కు సంబంధించిన పరిస్థితులను పర్యవేక్షించాలని సీఆర్పీఎఫ్‌ డీజీ కులదీప్‌ సింగ్‌ను ఆదేశించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సైతం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా, సీఆర్పీఎఫ్, డీఆర్జీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. బీజపూర్‌లోని సిల్గేర్ అటవీ ప్రాంతం తార్రేమ్ వద్ద కూంబింగ్ నిర్వహిస్తుండగా వారికి తారసపడ్డ మావోయిస్టుల సైన్యంపై కాల్పులు జరిపారు. ఎస్టీఎఫ్, డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా విభాగాలకు చెందిన దాదాపు 400 మంది జవాన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు చత్తీస్‌గఢ్ డీజీపీ డీఎం అవస్థీ తెలిపారు.


By April 04, 2021 at 01:06PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/jawans-death-toll-rises-to-22-in-chhattisgarh-maoist-attack/articleshow/81896125.cms

No comments