Breaking News

చత్తీస్‌గఢ్: 15 మంది జవాన్లు గల్లంతు.. 12 మంది నక్సల్స్ హతం


ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య శనివారం జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. బీజాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో మరో 15 మంది జవాన్లు గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం సీఆర్పీఎఫ్ బలగాలు గాలిస్తున్నాయి. బీజాపూర్, సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మరో 23 మంది జవాన్లు గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు, ముగ్గురు డీఆర్జీ పోలీసులు అమరులైనట్టు తెలిపారు. ఈ కాల్పుల్లో కనీసం 12 మంది మావోయిస్టులు కూడా హతమైనట్టు అధికారులు తెలిపారు. సీఆర్పీఎఫ్, డీఆర్జీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. బీజపూర్‌లోని సిల్గేర్ అటవీ ప్రాంతం తార్రేమ్ వద్ద కూంబింగ్ నిర్వహిస్తుండగా వారికి తారసపడ్డ మావోయిస్టుల సైన్యంపై కాల్పులు జరిపారు. ఎస్టీఎఫ్, డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా విభాగాలకు చెందిన దాదాపు 400 మంది జవాన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు చత్తీస్‌గఢ్ డీజీపీ డీఎం అవస్థీ తెలిపారు. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ మాట్లాడుతూ.. ప్రాథమిక సమాచారం ప్రకారం కనీసం 12 మంది నక్సలైట్లు హతమయ్యారని, మరో 15 మంది వరకూ గాయపడ్డారని అన్నారు. దీనిని ధ్రువీకరించడానికి మరింత సమయం పడుతుందని, ఎన్‌కౌంటర్ ప్రాంతంలో 250 మంది మావోయిస్టులు ఉన్నట్టు భావిస్తున్నామని అన్నారు. ఘటనా స్థలానికి 9 అంబులెన్స్‌లు, రెండఉ ఎంఐ-17 హెలికాప్టర్లను సహాయకచర్యలు వినియోగించినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనకు ముందు రోజే శక్తివంతమైన ఐఈడీని సీఆర్పీఎఫ్ దళాలు నిర్వీర్యం చేశాయి. బీజాపూర్ అటవీ ప్రాంతంలోని ఎనిమిదిన్నర కిలోల ఐఈఏడీని గుర్తించారు. మార్చి 23న నారాయణ్‌పూర్ జిల్లాలో భద్రతా దళాలు ప్రయాణిస్తున్న వాహానాన్ని నక్సల్స్ పేల్చేయడంతో ఐదుగురు డీఆర్జీ కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. సుక్మా జిల్లాలో భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని మందుపాతరను అమర్చుతున్న ముగ్గురు మావోయిస్టులను ఐటీబీపీ దళాలు గతవారం అదుపులోకి తీసుకున్నాయి.


By April 04, 2021 at 11:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/five-jawans-killed-15-missing-in-bijapur-encounter-12-naxals-also-gunned-down/articleshow/81895032.cms

No comments