Breaking News

బాధితురాలని పెళ్లిచేసుకోమని ఆదేశించలేదు.. అత్యాచారం కేసులో వ్యాఖ్యలపై సుప్రీం వివరణ


అత్యాచారానికి గురైన బాలికను పెళ్లిచేసుకుంటారా? సహకరిస్తామంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే వాటిపై వివరణ ఇచ్చారు. తమ వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారని, మహిళలంటే తమకు ఎనలేని గౌరవం ఉందని పేర్కొన్నారు. ‘బాధితురాలిని పెళ్లి చేసుకోమని మేం అతడికి మేం చెప్పలేదు.. వివాహం చేసుకోబోతున్నావా అని ప్రశ్నించాం తప్పా అతడికి ఎలాంటి ఆదేశాలివ్వలేదు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డులో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మోహిత్‌ సుభాష్‌ చవాన్‌ (23)పై అత్యాచారం కేసు నమోదయింది. 2014-15 మధ్య తన దగ్గర బంధువైన బాలికను ఆకర్షించి పలుమార్లు అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు చేశారు. ఆమె మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదయింది. ముందస్తు బెయిల్‌ కోసం నిందితుడు దరఖాస్తు చేయగా, బాంబే హైకోర్టు తిరస్కరించింది. దాంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా సీజేఐ జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం గతవారం విచారణ చేపట్టింది. నిందితుడికి ఓ అవకాశం ఇచ్చిన ధర్మాసనం ‘ఒకవేళ బాధితురాలిని పెళ్లి చేసుకుంటే సాయం చేస్తాం.. కాదంటే ఉద్యోగం పోగొట్టుకుని జైలుకు వెళ్తావు... బాలికను ఆకర్షించి అత్యాచారానికి పాల్పడ్డావు’ అని నిందితుడి తరఫున హాజరైన లాయర్‌‌తో ధర్మాసనం పేర్కొంది. ‘అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లి కోరింది.. కానీ అందుకు ఆ బాలిక నిరాకరించడంతో వేరే యువతితో వివాహం జరిగిందని తెలిపాడు. కానీ, బాధితురాలిని వివాహం చేసుకోమని ధర్మాసనం కోరడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమయ్యింది. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సైతం ద్రౌపది వస్త్రాపహరణంతో పోల్చుతూ ట్విట్టర్‌లో వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సీపీంఎ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ ఇటీవల సీజేఐకు లేఖ రాశారు. దీంతో ఆ వ్యాఖ్యలపై జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా స్పష్టతనిచ్చింది.


By March 08, 2021 at 04:21PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/highest-respect-for-women-chief-justice-says-maharashtra-rape-hearing-misreported/articleshow/81392767.cms

No comments