Breaking News

‘సారంగ దరియా’ వివాదం: కోమలి తొందరపడిందా.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన శేఖర్ కమ్ముల


అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘లవ్ స్టోరి’. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘సారంగ దరియా’ సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్ అయ్యింది. వారం రోజుల్లోనే 30 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. పల్లెల్లొ పాడుకునే ఒక తెలంగాణ జానపద గీతాన్ని ఆధునిక హంగులతో సినిమాటిక్‌గా తెరపై చూపించబోతున్నారు. సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, మంగ్లీ గాత్రం, సాయి పల్లవి డాన్స్.. ఇలా ఈ పాటలోని ప్రతీది ప్రత్యేకమే. అయితే, ఈ పాటపై వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ‘సారంగ దరియా’ పాటను తొలిసారి కొన్నేళ్ల క్రితం ‘రేలారే రేలా’ ప్రోగ్రామ్‌లో శిరీష అనే గాయని ఆలపించింది. ఆ సమయంలోనూ ఈ పాట అందరినీ ఆకట్టుకుంది. కోమలి నుంచి తీసుకుని శిరీష ఈ పాటను పాడింది. కోమలి తన అమ్మమ్మ దగ్గర నుంచి ఈ పాటను సేకరించినట్టు చెప్పారు. తన పాటను సుద్దాల అశోక్ తేజ మార్చి రాసి క్రెడిట్ కొట్టేశారని.. అలాగే, ఈ పాటను తనతో కాకుండా మంగ్లీతో ఎందుకు పాడించారని ప్రశ్నించారు. గత వారం రోజులుగా టీవీ ఛానెల్స్‌ ద్వారా కోమలి తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కంటతడి కూడా పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో అయితే సుద్దాల అశోక్ తేజపై, శేఖర్ కమ్ములపై ఒకటే ట్రోలింగ్. అయితే, ఈ వివాదంపై ఎట్టకేలకు శేఖర్ కమ్ముల స్పందించారు. ఈ పాట వెనకాల ఏం జరిగిందో తన ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వివరించారు. ‘‘చాలా ఏళ్ళ కిందట ‘రేలా రే రేలా’ ప్రోగ్రాంలో శిరీషా అనే అమ్మాయి ‘సారంగ దరియా’ అనే పాట పాడింది. ఆ పాట నాకు అలా గుర్తుండిపోయింది. ఆ పాట ఎంత నచ్చింది అంటే అంత నచ్చింది. ఈ ఫిల్మ్ విజువలైజ్ చేస్తున్నప్పుడల్లా ఈ పాట నా మైండ్‌లో తిరుగుతూనే ఉంది. నా తొలి చిత్రం ‘డాలర్ డ్రీమ్స్’లో లక్కీ అలి పాట ఉంటుంది. ఆ పాటని సినిమాలో వాడినందుకు సోనీ కంపెనీకి నేను డబ్బులు చెల్లించాను. సినిమాలో క్రెడిట్స్ కూడా ఇచ్చా. తర్వాత తీసిన ‘ఆనంద్’లో లక్కీ అలితో పాడించుకున్నా కూడా. ఆనంద్ ఫిల్మ్‌లో సుబ్బలక్ష్మి గారి పాట నుండి ‘ఫిదా’లో మల్లీశ్వరి అప్పగింతల పాట వరకు.. స్టోరీ రాస్తున్నప్పుడు నాకు ఒక్కో సినిమాకి ఒక్కో పాట తిరుగుతుంటుంది. ‘లవ్ స్టోరీ’ ఫిల్మ్‌కి నా మనసులో ఈ పాట ఉంది. సుద్దాల గారిని కలిసాను. ఈ పాటని సినిమాకి అనుకూలంగా రాయాలి అంటే, ఈ పాట పల్లవి తీస్కొని, చరణాలు రాశారు. ఆ పాటకి అంత బాగా లిరిక్స్ రాసినందుకు చాలా సంతోషపడ్డాను. మా టీంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు శిరీష ఫోన్ నంబర్ సంపాదించి, ఆమెని కాంటాక్ట్ చేశారు. ఆమెకి అప్పటికి డెలివరీ టైం అంటే, మేం ఇంక సరే అనుకున్నాం. కరోనా వల్ల ఫిల్మ్ ఆగి, మళ్ళీ షూట్ స్టార్ట్ అయ్యింది. అప్పుడే పుట్టిన బిడ్డతో ఉన్న శిరిషని ఇబ్బంది పెట్టాలి అనిపించలేదు. ఈ పాటని నవంబర్‌లో షూట్ చేశాం. అది కూడా ట్రాక్ సింగర్ పాడిన వెర్షన్‌తోనే. ఫిబ్రవరి ఆఖరులో మంగ్లీతో పాడించాం. ప్రోమో రిలీజ్ అయ్యాక సుద్దాల గారు ఫోన్ చేశారు. ‘ఇద్దరు సింగర్స్‌ ఆ పాట మేమే పాడాలి అంటున్నారు అని’. ఇద్దరి నంబర్లు ఇచ్చారు. మా టీంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆ ఇద్దరితో మాట్లాడారు. నేను వెంటనే సుద్దాల గారి ఇంటికి వెళ్ళాను. ఈలోగా ఆయన వివరాలు సేకరించి, ‘ఆ ఇద్దరిలో కొమలే ఆ పాటని వెలికితీసుకొచ్చింది, ఆమెతో పాడిద్దాం’ అని సుద్దాల గారు అన్నారు. నా ముందే ఆయన కోమల (కోమలి)కి ఫోన్ చేశారు. ‘పాట రిలీజ్ చేస్తాం అని అనౌన్స్ చేసాం కాబట్టి, కోమలని వెంటనే రమ్మని’ అడిగాం. వరంగల్ నుండి రావటానికి ఏర్పాటు చేస్తాం అన్నాం. మ్యూజిక్ డైరెక్టర్‌ను చెన్నై నుండి రప్పించాం. ‘జలుబు ఉంది, రాలేను’ అంది కోమల. పాట అనౌన్స్ చేశాం కాబట్టి మా ఇబ్బంది చెప్పాం. తనకి క్రెడిట్ ఇస్తే అభ్యంతరం లేదు అంది. ‘జెన్యున్ కేస్ సార్, క్రెడిట్‌తో పాటు డబ్బులు కూడా ఇస్తే బాగుంటుంది’ అని సుద్దాల గారు అన్నారు. కోమలని అడిగితే, మీ ఇష్టం సర్, ఎంత ఇస్తే అంత ఇవ్వండి అంది. కచ్చితంగా ఇస్తాం అని చెప్పాను. ఆడియో ఫంక్షన్‌లో పాడమని, విజిబులిటీ బాగా ఉంటుంది అని, కచ్చితంగా రమ్మని నేనే కోమలకి చెప్పాను. ఆమె సరే అంది. సుద్దాల గారి ఇంటి నుండి ఫోన్లో కోమలతో చెప్పినట్టుగానే, పాట రిలీజ్ చేసినప్పుడు ఫేస్‌బుక్‌లో కోమలకి థాంక్స్ చెప్పాను. మరుగున పడిన జానపద గీతాన్ని వెలికి తీసుకొచ్చిన కోమలకి మేం ప్రామిస్ చేసినట్టు ఫిల్మ్‌లో క్రెడిట్ ఇస్తాం, డబ్బులు ఇస్తాం, ఆడియో ఫంక్షన్ ఫిక్స్ అయితే కోమలకి పాడమని ఇన్విటేషన్ పంపిస్తాం. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పడి నేను టీవీల్లో జరుగుతున్న చర్చలు ఫాలో కాలేదు. ఒకేసారి ఫేస్‌బుక్‌లో అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు’’ అని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు శేఖర్ కమ్ముల.


By March 10, 2021 at 08:34PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/love-story-director-sekhar-kammula-gives-clarity-on-saranga-dariya-song-controversy/articleshow/81434132.cms

No comments