Breaking News

ఎయిర్‌పోర్ట్‌లో అగ్ని ప్రమాదం.. కిలోమీటర్ మేర ఎగిసిన మంటలు.. వీడియో


రాజస్థాన్‌లోని కోటా విమానాశ్రయం రన్‌వేపై సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏరోడ్రోమ్‌పై చెలరేగిన మంటలను మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించి అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో గాలులు బలంగా వీయడంతో మంటలు దాదాపు కిలోమీటరున్నర దూరం ఎగిసిపడ్డాయి. మొత్తం ఏడు అగ్నిమాపక యంత్రాలతో 30 మంది సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. రన్‌వే పక్కన ఉన్న ఎండు గడ్డికి నిప్పంటుకోవడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎయిర్‌పోర్ట్ కాంప్లెక్స్ పరిసరాల్లో ఆరు నుంచి ఏడు అడుగుల ఎత్తున పెరిగిన గడ్డి ఎండిపోవడంతో మంటలంటుకున్నాయి. మంటల తీవ్రతకు దాని పక్కనే ఉన్న ప్రహరీ గోడ కూలిపోయింది. రాత్రివేళ మంటలు చెలరేగడంతో సహాయక చర్యలు ఆటంకం ఏర్పడింది. ఈ ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది ఒకరు గాయపడ్డారు. అయితే, అతడికి స్వలగాయాలయ్యాయని, ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి ఎండుగడ్డి కారణమైనా, మంటలు ఎలా అంటుకున్నాయో తెలియరాలేదన్నారు. కోటా మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక సిబ్బంది అధికారి దేవేంద్ర శర్మ మాట్లాడుతూ.. సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపుచేశామని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి మూడు వైపులా ఇంధన ట్యాంకులు ఉన్నాయని, సమీపంలో ఓ పెట్రోల్ బంకు సైతం ఉందని పేర్కొన్నారు. దాదాపు కిలోమీటరన్నర ప్రాంతం వరకూ మంటలు వ్యాపించాయని వివరించారు. ఆ సమయంలో గాలులు బలంగా వీయడంతో మంటలను అదుపుచేయడానికి ఇబ్బంది పడ్డామని అన్నారు. ప్రస్తుతం అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


By March 30, 2021 at 10:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/a-fierce-fire-broke-out-in-the-dry-bushes-of-the-airport-complex-in-kota/articleshow/81753378.cms

No comments