Breaking News

సింహాన్ని వేధించిన మూర్ఖులు.. ఏడుగురికి కారాగార శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు!


మృగరాజును వేధింపులకు గురిచేసి, హింసించిన వ్యక్తులకు న్యాయస్థానం శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. గుజరాత్‌లోని గిర్ అడవిలో ఓ సింహాన్ని ఏడుగురు వ్యక్తులు వేధించారు. వీరిలో ముగ్గురు పర్యాటకులు కూడా ఉన్నారు. ఈ ఘటన 2018లో చోటుచేసుకోగా.. పోలీసులు కేసు నమోదుచేశారు. అహ్మదాబాద్‌కు చెందిన ముగ్గురు పర్యాటకులతో సహా ఏడుగురిని దోషులుగా గిర్ గధాడ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ సునీల్ కుమార్ దేవ్ ప్రకటించారు. వీరిలో ఆరుగురు నిందితులకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, మరొకరికి ఏడాది జైలు శిక్ష ఖరారు చేశారు. గిర్ అడవుల్లో బాబారియా పరిధిలోని ధూంబకారియాలో కొందరు వ్యక్తులు ఓ కోడిని సింహానికి ఎరగా వేసి వేధించారు. ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు 2018 మే నెలలో నిందితులను ఎనిమది మంది నిందితులను అరెస్టు చేశారు. సింహానికి కోడిని ఎరగా వేస్తూ దాన్ని ఆటపట్టించారు. గిర్ గధాడ తాలూకాకు చెందిన ఇలియాస్ హోత్, అబ్బాస్ బలూచ్, అల్తాఫ్ బలూచ్‌, అహ్మదాబాద్‌కు చెందిన పర్యాటకులు రవి పటాడియా, దివ్యంగ్ గజ్జర్, రతిన్ భాయ్ పటేల్‌లను కోర్టు దోషులుగా నిర్ధారించింది. వన్యప్రాణి రక్షణ చట్టం సెక్షన్ 2 (16) (బి) ఏదైనా జంతువులను పట్టుకోవడం, ఉచ్చువేయడం, ఎర వేయడం, అభయారణ్యంలో అక్రమంగా ప్రవేశించడం నేరం. ఈ చట్టం కింద ఆరుగురికి మూడేళ్ల శిక్ష, మరో దోషి మీనాకు సెక్షన్ 27 ప్రకారం ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది. దోషులకు రూ.10వేల చొప్పున జరిమానా విధించిన కోర్టు.. సింహాల సంక్షేమ నిధికి మరో రూ.35,000 జమ చేయాలని ఆదేశించింది. అలాగే, సింహాన్ని వేధింపులకు గురిచేసినట్టు సాక్ష్యాలు లేవని తేలడంతో మరో నిందితుడు హసంభాయ్ కొరెజాను కోర్టు నిర్దోషిగా పేర్కొంది.అంతేకాదు, బాబ్రియా అటవీ పరిధిలోని ధుంబకారియో వద్ద నిందితుల్లో ఒకరి కుటుంబానికి కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.


By March 10, 2021 at 03:09PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/seven-jailed-for-harassing-lioness-with-bait-in-gujarats-gir-forest-in-2018/articleshow/81428951.cms

No comments