Breaking News

'చిచ్చా లుచ్చా' అంటూ రాహుల్ సిప్లిగంజ్ రచ్చ.. బిగ్ బాస్ విన్నర్‌పై మంత్రి హరీష్ రావు కామెంట్స్


బిగ్ బాస్ మూడో సీజన్ విజేతగా రాహుల్ సిప్లిగంజ్‌కు ఎంతటి ఆదరణ వచ్చిందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోలోకి రాకముందే ప్లే బ్యాక్ సింగర్, ఇండిపెండెంట్ ఆల్బమ్ క్రియేటర్‌గా రాహుల్ సిప్లిగంజ్‌కు భారీ మాస్ ఫాలోయింగ్ ఉండేది. యూట్యూబ్‌లో అతని ప్రైవేట్ ఆల్బమ్స్ మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతుంటాయి. అలా అక్కడ వచ్చిన క్రేజ్ ద్వారానే బిగ్ బాస్ ఎంట్రీ లభించింది. బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన ఇమేజ్‌తో ఏకంగా వెండితెరపై స్టార్ అయ్యే చాన్స్‌లు వచ్చాయి. సింగర్‌గా ఉన్న రాహుల్ సిప్లిగంజ్‌ను బిగ్ బాస్ షో నటుడిని చేసేసింది. బిగ్ బాస్ షోలో రాహుల్ సిప్లిగంజ్‌ను చూసిన రమ్యకృష్ణ.. కృష్ణవంశీ 'రంగమార్తాండ' సినిమాకు రికమండ్ చేశారట. ఈ విషయాన్ని స్వయంగా వెళ్లడించారు. అలా మొదటి సినిమానే కృష్ణవంశీ లాంటి దర్శకుడితో చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఈ చిత్రంలో కళాకారుడిగా రాహుల్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. సోలో హీరోగా రాహుల్ ఇప్పుడు తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఓ వైపు సినిమాలు, పాటలు అంటూ బిజీగానే ఉన్నారు. మరోవైపు ఊకో కాక అంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఊకో కాక బ్రాంచ్‌లను ప్రారంభిస్తున్నారు. తాజాగా సిద్దిపేటలో తన కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించారు రాహుల్. సిద్దిపేట ఊకో కాక మెన్స్ వేర్ బ్రాంచ్‌ను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ క్రమంలోనే తన కొత్త సినిమా టైటిల్ అండ్ టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేయించి మంచి ప్రమోషన్స్ కల్పించుకున్నారు. నిన్న సాయంత్రం వదిలిన చిచ్చా పోస్టర్, టైటిల్ సాంగ్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో సినిమా పోస్టర్, టైటిల్ లాంచ్ ఈవెంట్‌లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ‘సినిమా టైటిల్ బాగుంది. చిచ్చా తెలంగాణ బ్రాండ్‌ను ప్రమోట్ చేసేలా ఉంది. రాహుల్ మన తెలంగాణ బిడ్డ. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. మొదటి సినిమాకు ఎలాంటి సాయం కావాలన్నా కూడా నేను చేస్తాను. ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రేంజ్‌కు ఎదగాలి. బిగ్ బాస్‌ షోను ఎలా హిట్ చేశాడో.. సినిమాను కూడా అలాగే హిట్ చేయాలి’ అని కోరుకున్నారు. ఇక ‘చిచ్చా’ టైటిల్ సాంగ్‌లో.. బచ్చా, లుచ్చా అనే పదాలతో పాట మొత్తం మాస్ ట్యూన్‌లో సాగిపోయింది. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటను సంగీత దర్శకుడైన వేంగి రాసి కంపోజ్ చేశారు. ఆర్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్‌పై రాబోతోన్న ఈ మూవీని మల్లిక్ కందుకూరి తెరకెక్కిస్తున్నారు. అయితే చిచ్చా సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారు అనే విషయాన్ని మాత్రం సీక్రెట్‌గానే ఉంచారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన వివరాలన్నీ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.


By March 20, 2021 at 12:14PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/minister-t-harish-rao-comments-on-rahul-sipligunj/articleshow/81601249.cms

No comments