Breaking News

మలుపు తిరిగిన అంబానీ కేసు: హిరేన్ మొబైల్ మిస్సింగ్.. హత్యేనా?


అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల కారు కేసులో వాహనం యజమాని అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ ఘటనపై మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజమ్ స్క్యాడ్ ఆదివారం కేసు నమోదుచేసింది. తొలుత దీనిని ఆత్మహత్యగా భావించిన పోలీసులు.. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. అయితే, హిరేన్‌ను హత్యచేసిన తర్వాత నదీ పాయలో పడేసి ఉంటారని భావిస్తున్నారు. ఆయన మొబైల్‌ను కూడా హంతకులు తీసుకెళ్లినట్టు దర్యాప్తు వర్గాలు అనుమానిస్తున్నారు. హిరేన్ చనిపోయిన రోజు రాత్రి 11.30 గంటలప్పుడు ఆయన మొబైల్ చివరిసారిగా వాసాయ్ వద్ద వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు. హిరేన్ శవం గుర్తించిన స్పాట్‌కు వెళ్లిన ఏటీఎస్ అధికారులు అక్కడ ఆధారాల కోసం పరిశీలించారు. అనంతరం హిరేన్ ఇంటికి వెళ్లి, ఆయన భార్య విమల, ఇద్దరి కుమారులను ప్రశ్నించారు. భార్య విమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదుచేశారు. తొలుత ప్రమాదవశాత్తు చనిపోయినట్టు ముంబ్రా పోలీసులు కేసు నమోదు చేయగా.. ఏటీఎస్ దానిని హత్య కేసు కిందకు మార్చిందని పోలీస్ వర్గాలు తెలిపారు. హిరేన్ సోదరుడు విమల్ మాట్లాడుతూ.. ఈ మృతిపై తమ కుటుంబానికి అనుమానాలు ఉన్నాయని తెలిపాడు. థానేలోని తన ఇంటి నుంచి గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో హిరేన్ బయటకు వెళ్లినట్టు చెప్పారు. గోడ్‌బండూర్ రోడ్డులోని త్వాడే వద్ద ఓ వ్యక్తి కలవడానికి వెళ్తున్నట్టు తెలిపాడు. ఆయన మొబైల్ ఫోన్ ఏమయ్యిందనేది మిస్టరీగా మారింది. పోస్ట్‌మార్టమ్ నివేదిక అస్పష్టంగా ఉండటంతో ఆయన పొట్టలోని అవయవాలను తదుపరి పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. గాయాల స్వభావం సహా నివేదికలో పరిశీలించాల్సి చాలా ఉన్నాయని, ఆయన నోట్లో గుడ్డలు కుక్కిన ఆనవాళ్లు ఉన్నాయని ఓ అధికారి అన్నారు. ఏటీఎస్ చీఫ్ జయ్ జీత్ సింగ్, డీఐజీ శివ్‌దీప్ లాండేలు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ప్రారంభంలో క్రైమ్ బ్రాంచ్ అనుసరించిన దర్యాప్తును కూడా ఏటీఎస్ బృందం పరిశీలించనుంది. ఇక, తన ఎస్‌యూవీని దొంగిలించిన తర్వాత ఫిబ్రవరి 17న హిరేన్ ఓలా క్యాబ్ బుక్ చేసుకుని క్రాఫోర్డ్ మార్కెట్‌లోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లారు. కానీ, సీఎస్టీ సమీపంలోని మరొక ప్రదేశానికి వెళ్లి క్యాబ్ దిగారు. దారి పొడవునా మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ.. అవతలి వ్యక్తిని పదే పదే ‘సర్’ అంటూనే ఉన్నారని క్యాబ్ డ్రైవర్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఒకవేళ అంబానీ నివాసం వద్ద కారు నిలిపిన వ్యక్తి గుర్తింపు గురించి హీరేన్‌కు ఏదైనా సమాచారం తెలిసిందా అనే ఈ అంశాన్ని కూడా అధికారులు నిర్ధారించనున్నారు.


By March 08, 2021 at 03:29PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/mukesh-ambani-case-ats-probes-businessman-hiren-death-as-murder/articleshow/81391783.cms

No comments